CM KCR Speech at BRS Praja Ashirvada Sabha in Adilabad : మంది మాట విని ఆగమైతే ఐదేళ్లపాటు కష్టాలు పాలవుతారని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. అందుకే నిజానిజాలు గమనించి, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నానని తెలిపారు. ఇంకా పార్టీల చరిత్ర, నడవడిక ఎలాంటిదో కూడా ఒకసారి చూడాలని కోరారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో సీఎం కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
కేంద్రంలో వచ్చేది.. ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. 2024 తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్ కీలకం కానుందన్నారు. నాటి నుంచి నేటి వరకు చైతన్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఆదిలాబాద్ అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా పరిణతి రాలేదని ఆవేదన చెందారు. ఎన్నికలనగానే ఎందరో వస్తున్నారు.. ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ నియోజకవర్గం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్(BRS)నే గెలిపించాలని సూచించారు. బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల బాగు కోసమన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యమని సీఎం కేసీఆర్ వివరించారు.
'కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా? రైతుబంధు కావాలా.. రాబంధు కావాలా.. ఒక్కసారి ఆలోచించండి. జోగురామన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. నాతో కొట్లాడి ఆదిలాబాద్‌కు జోగురామన్న ఇంజినీరింగ్ కాలేజీ తెచ్చుకున్నారు. మైనార్టీలను ఎప్పుడూ ఓటు బ్యాంక్‌గానే కాంగ్రెస్ చూసిందని' సీఎం కేసీఆర్ ఆరోపించారు.
ఉచిత కరెంట్‌పై జానారెడ్డి మాట తప్పారు - హాలియా సభలో కేసీఆర్
CM KCR Fires on Congress : తెలంగాణ రాకముందు చాలా సమస్యలు ఉన్నాయని.. వాటి అన్నింటినీ అధిగమించి సంక్షేమంతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. అందుకే రైతుబంధు(Rythu Bandhu) ఉండాలంటే బీఆర్‌ఎస్ కచ్చితంగా గెలవాలన్నారు. 24 గంటల కరెంటు వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే అంటున్నారని గుర్తు చేశారు. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.
"రాష్ట్రంలో అన్ని మతాలు వారు కలిసిమెలసి ఉంటున్నారు. ఈసారి మత కల్లోలాలు సృష్టించే బీజేపీను ఓడించాలి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. 2024 కచ్చితంగా బీఆర్‌ఎస్‌దే. ఆ ఎన్నికల్లో మనమే ప్రాధాన్యం కాబోతున్నాం. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి." -కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత
CM KCR Election Campaign at Adilabad : అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్‌గాంధీ అంటున్నారని విమర్శించారు. ఈ ధరణి ఉండటం వల్లే రైతుబంధు డబ్బులు దళారుల పాలు కాకుండా నేరుగా రైతుల అకౌంట్లో పడుతున్నాయని చెప్పారు. ఈరోజు ధరణి పోర్టల్ ఉండడం వల్లే రైతుబీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయని వివరణ ఇచ్చారు. ఇందుకోసం మూడేళ్లు ఆలోచించి.. రైతుల బాగుకోసం ధరణిని తీసుకువచ్చామన్నారు. రైతు చనిపోతే వారంలోనే బీమా వచ్చేలా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకు ఎందుకు ఓటేయాని ప్రజలను ప్రశ్నించారు.
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదు - రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా : కేసీఆర్