Adilabad Telangana Election Result 2023 LIVE : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు విభిన్న తీర్పునిచ్చారు. 10 నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారత జనతా పార్టీలు(BJP) చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో 9 సీట్లను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ.. ఈ సారి కేవలం 2 నియోజకవర్గాలకే పరిమితమైంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బెల్లంపల్లిలో గడ్డం వినోద్, చెన్నూరులో వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు, మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు గెలుపొందారు.
బీజేపీ అభ్యర్థులు ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్, ముథోల్‌లో రామారావు పవార్, నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి, సిర్పూర్‌లో హరీశ్‌బాబు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, బోథ్‌లో అనిల్ జాదవ్ గెలుపొందారు. సిర్పూర్‌లో పోటీచేసిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) రెండో స్థానానికి పరిమితమయ్యారు.
బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ విజయం : దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపిన సింగరేణి కాలరీస్ కంపెనీలో బొగ్గుగనుల క్షేత్రంగా కీలక పాత్ర పోషించిన నియోజక వర్గం ‘బెల్లంపల్లి’. ఇక్కడ కార్మికులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే నెగ్గుకొస్తుంది. గతంలో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ గెలుపొందగా, ఈ దఫా మాత్రం పంథా మార్చిన కార్మికులు హస్తం వైపు మొగ్గుచూపారు. ఈ దెబ్బకు అధికార బీఆర్ఎస్ పరాజయం పాలైంది.
చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ విజయం : వివేక్ వెంకటస్వామి ఊహించని విధంగా బీజేపీనీ వీడి హస్తం గూటిలో చేరి ఎన్నికల బరిలో నిలవడంతో అందరి దృష్టి చెన్నూరు నియోజకవర్గంపై పడింది. రాజకీయం(Politics) రసవత్తరంగా మారడంతో, ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలకు ప్రాధాన్యం ఇచ్చాయి. ఏదేమైనప్పటికీ బరిలో చివరికి చెన్నూర్ చేతికి వశమైంది. బీఆర్ఎస్ పార్టీనుంచి బాల్కన్ సుమన్, బీజేపీ దుర్గం అశోక్‌లు ఓటమి చవిచూడాల్సివచ్చింది.
ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జ విజయం : ఎన్నికల హోరులో ఖానాపూర్‌లో విజేతగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెడ్మా బొజ్జ నిలిచారు. ఖానాపూర్ నియోజక వర్గం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 3 సార్లు, టీడీపీ 4 సార్లు, టీఆర్ఎస్ 3 సార్లు గెలుపొందింది. ఈ దఫా ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన బరిలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ భూక్యా జాన్సన్ నాయక్, బీజేపీ అభ్యర్థి రమేశ్ రాఠోడ్‌లు ఓటమి పాలయ్యారు.
మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు (కాంగ్రెస్) విజయం : మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్‌సాగర్‌రావు గత రెండు పర్యాయాలు ఓడినా.. ఈసారి మాత్రం గెలపు బావుటా ఎగురవేశారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే పదవి(MLA Seat) అందని ద్రాక్షగానే మిగిలిన ఈసారి మాత్రం గెలుపు వరించింది. 2005 నుంచి 2007 వరకు డీసీసీబీ చైర్మన్‌గా, 2007 నుంచి 2013 వరకు ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా వ్యవహరించిన ప్రేమ్‌సాగర్, అప్పట్లో రాజకీయంగా ఓ వెలుగు వెలిగారు. 2014లో సిర్పూర్ నుంచి, 2018లో మంచిర్యాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి విజయం : ఈ దఫా ఎన్నికల్లో పార్టీ శ్రేణులే కాకుండా అభ్యర్థుల కుటుంబీకులు, రక్త సంబంధీకులు రంగంలోకి దిగి ప్రచారం హోరెత్తించారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(Indrakaran Reddy) గెలుపునకు కోడలు అల్లోల దివ్యారెడ్డి, కుమార్తె పల్లవిరెడ్డి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకున్నప్పటికీ పెద్దగా అవి ఫలితం చూపలేదు. నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి పట్టం కట్టారు. వైఫల్యాన్ని తట్టుకోలేని ఇంద్రకరణ్ రెడ్డి కౌంటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
కాంగ్రెస్‌ను విజయతీరాలకు నడిపించిన మాస్టర్ మైండ్ ఎవరిది? ఆయన సక్సెస్ మంత్ర తెలుసా?
ముథోల్‌లో బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ విజయం : ముథోల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు సపిరివార ప్రచారాల హోరు ముఖ్యంగా ప్లస్ అయ్యింది. బీజేపీ తరఫున పోటీలో ఉన్న రామారావు పటేల్ విజయం సాధించారు. పటేల్ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఆయన తనయులు సతీష్ పవార్, సందీప్ పవార్‌లు ప్రచారాలు జరిపారు. ప్రధాన ప్రత్యర్థులుగా అధికార బీఆర్ఎస్ నుంచి గడ్డిగారి విఠల్‌రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోస్లే నారాయణ్‌రావు నిలిచి ఓటమి పాలయ్యారు.
ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి శంకర్ విజయం : ఆదిలాబాద్ రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాయల్ శంకర్‌లది గతంలో విడదీయరాని బంధం. అలాంటి మిత్రులు(Friends) ప్రత్యర్థులుగా మారారు ఈ ఎన్నికల్లో. ఇదివరకే మూడు సార్లు తలపడగా ఇప్పుడు నాలుగోసారి రంగంలోకి దిగడం ఆసక్తిగా మారింది. ఎట్టకేలకు ఫలితాల్లో ఆదిలాబాద్‌లో కమలం వెలసింది.
సిర్పూర్‌లో పాల్వాయి హరీశ్ (బీజేపీ) విజయం : సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉన్న బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి శ్రీనివాస్ పరాజయం పాలయ్యారు.
బోథ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం : బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై(Soyam Bapurao) 23,023 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి విజయం : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కారు పార్టీ జోరు కనిపించింది. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి 23,110 మెజార్టీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్‌పై గెలుపొందారు. జిల్లా కేంద్రంలో గులాబీ పార్టీ అభ్యర్థి జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ గెలుపొందడంతో సంబరాలు జరుపుకున్నారు .