తన కూతురును చూసేందుకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. చూడటానికి వస్తున్నా అని చెప్పిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం రాంపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నార్నూర్ మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన పాటిల్ వందన(40) దుర్మరణం పాలయ్యారు. ఆమె భర్త తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. తాంసి మండలం జామిడి గ్రామంలో ఉన్న పెద్ద కూతురు ఇంటికి ఆదివారం ద్విచక్రవాహనంపై బయలు దేరారు. నాందేడ్‌కు చెందిన ఓ వ్యక్తి కారులో కుటుంబంతో హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు వెళ్తున్నారు. రాంపూర్ జాతీయ రహదారి మూలమలుపు వద్ద కారు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వందనకు తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. భర్త పాటిల్ విలాస్ తలకు తీవ్ర గాయాలవడంతో రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం...