చేతిలో ఏడు కంజరీలను పట్టుకొని ప్రదర్శిస్తున్న ఈ పెద్దాయన పేరు భీంరావు మోహన్‌సింగ్ పవార్. 'మహారాష్ట్ర-పూసద్' తాలూకలోని దహీవాడక్ గ్రామం. వ్యవసాయదారుడైన భీంరావు.. దివంగత తుకుడోజీ మహారాజ్ ఆశయాలను ప్రచారం చేసే సంగీతకారుడు. స్వాతంత్ర సమరంలో తుకుడోజీ మహారాజ్ భజనలతో జన జాగృతి కోసం ప్రచారం చేశారు. అప్పట్లో అన్ని చోట్ల తబల, తాళం, హార్మోనియం అందుబాటులో ఉండేవి కావు.
దాంతో స్వతహాగా కంజరీ వాయిద్యకారుడైన మహారాజ్.. సప్తస్వరాలను పలకించేలా ఏడు కంజరీలతో చేసిన ప్రయోగమే సప్తకంజరీ సుస్వరం. దాన్ని సాధన చేసిన భీంరావు.. ఇప్పుడు మహారాజ్ ఆశయాలైన మద్యం, మాంసం, జూదం అనే వ్యసనాలకు వ్యతిరేకంగా.. దేశంలో కీలకపాత్ర వహిస్తున్న రైతులు, సైనికుల పాత్రను వివరిస్తారు. హంగులు, ఆర్భాటాలకు తావివ్వకుండా తుకుడోజీ మహారాజ్ శిష్యులు ఎక్కడికి ఆహ్వానించిన భీంరావు వెళ్తారు.
ఆదిలాబాద్ రాంనగర్ కాలనీలోని రామాలయంలో మహారాజ్ పుణ్యతిథి వేడుకలను ప్రదర్శించారు. అందులోని సప్తకంజరీ సుస్వర భజన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. సంగీతం మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాదు.. మనిషిని మారుస్తుందంటున్నారు భీంరావు.
"సప్తకంజరీ అంటే ఏడు కంజరీలు ఒకేసారి వాయించటం. దీని వల్ల ఉత్సాహం, ఆనందం వస్తుంది. తుకుడోజీ మహారాజ్ ఆశయాలను వివరిస్తాం. మేము కంజరీ వాయిస్తూ భజనలు చేస్తాం." -బండారి దేవన్న, సామాజిక కార్యకర్త, ఆదిలాబాద్
ఇవీ చదవండి: కార్తిక పౌర్ణమి.. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం
వితంతువైన కోడలికి రెండో పెళ్లి చేసిన మాజీ ఎంపీ.. సమాజానికి కొత్త సందేశం!