రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిలాబాద్‌లో కల్యాణలక్ష్మి పథకం అక్రమాల్లో రూ.86లక్షల 85వేల నిధులు దుర్వినియోగం అయినట్లు రెవెన్యూ యంత్రాంగం తేల్చింది. జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 111 మంది బినామీ లబ్ధిదారుల పేరిట దరఖాస్తులు చేసినట్లు పేర్కొన్నారు. వారిలో 87 మందికి డబ్బులు పొందారని అన్నారు.
దీనిపై ఈటీవీ-ఈటీవీ భారత్‌లో వరుస కథనాలు ప్రసారం కాగా అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం... నెల రోజులుగా అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. ఈ అక్రమాల్లో 9మంది దళారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా బోథ్ నియోజకవర్గం పరిధిలోని సిరికొండ మండలంలో 39 మంది బినామీ వ్యక్తులు, ఇచ్చోడ మండలంలో 23 మంది ఉన్నట్లు వెల్లడించారు.
గుడిహత్నూర్ మండలంలో నలుగురు, ఆదిలాబాద్, నేరడిగొండ మండలాల్లో ఒక్కొక్కరి చొప్పున నిధులు పొందినట్లు పేర్కొన్నారు. బోథ్ మండలంలో 13 మంది, ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్ , ఉట్నూర్ మండలాల్లో ఇద్దరేసి చొప్పున నిధులను పొందినట్లు విచారణలో తేల్చారు. దళారులుగా గుర్తించిన వారి నుంచి దుర్వినియోగం అయిన నిధులను రాబట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: అరబిక్ రుచులు.. అందించే అతివలు.. ర్యాంప్‌పై హొయలు