టోక్యో పారాలింపిక్స్ డిస్కస్ త్రోలో భారత క్రీడాకారుడు యోగేశ్ కథునియా మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల ఎఫ్56 ఫైనల్ ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచి.. రజతం గెలుచుకున్నాడు.
ఆరో ప్రయత్నంలో అత్యధికంగా 44.38 మీ. దూరం డిస్కస్ త్రోను విసిరి.. రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది. అంతకుముందు ఆదివారం హైజంప్‌లో రజత పతకం తర్వాత ఇది రెండోది. ఈ సందర్భంగా యోగేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
"యోగేశ్ కథునియా నుంచి అత్యుత్తమ ప్రదర్శన. దేశం కోసం రజత పతకం సాధించినందుకు సంతోషం. అతడి విజయం వర్థమాన అథ్లెట్లను ప్రోత్సహిస్తుంది. యోగేశ్‌కు అభినందనలు. అతడి భవిష్యత్‌లోనూ అనేక విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు.