భవీనాబెన్ పటేల్ (Bhavina Hasmukhbhai Patel).. పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన అథ్లెట్. మహిళల సింగిల్స్ క్లాస్ 4 టేబుల్ టెన్నిస్‌లో సంచలన ప్రదర్శనతో ఆమె సెమీస్ చేరింది. అయితే ఆమె మెరుగైన ఈ ప్రదర్శన వెనక ఆమె పడిన కష్టం కూడా చాలా ఉంది. అదేంటో ఓ సారి చూద్దాం.
రియోలోనే ఎంపిక కానీ..
ఐదేళ్ల కిందటే 2016 రియో పారాలింపిక్స్‌కు భవీనా ఎంపికైంది. కానీ సాంకేతిక కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయినా ఆమె పట్టుదల వీడలేదు. టోక్యోలో అడుగుపెట్టి తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది. అయినా ఆమె ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. ఎందుకంటే ఇలాంటి అడ్డంకులు.. ఒడుదొడుకులు.. ప్రతికూల పరిస్థితులు.. ఆమెకు చిన్నప్పటి నుంచే అలవాటు. ఎన్నో సవాళ్లను దాటి జీవితంలో విజేతగా నిలిచిన ఆమె.. ఇప్పుడదే పోరాట స్ఫూర్తితో పారాలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించే స్థాయికి చేరింది. పోలియోను దాటి పారాలింపిక్స్ పతకాన్ని చేరుకున్న భవీనాబెన్ ప్రయాణం స్ఫూర్తిదాయకం.
సరాదాగా ఆడిన ఆటే..
గుజరాత్‌లోని మధ్యతరగతి కుటుంబంలో భవీనాబెన్ జన్మించింది. కానీ ఏడాది వయసు వచ్చేసరికే పోలియో కారణంగా ఆమె కాళ్లు చచ్చుబడిపోతున్నాయనే విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఆమె నాలుగో తరగతిలో ఉండగా.. శస్త్రచికిత్స కోసం విశాఖపట్నం తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వైద్యులు చెప్పిన సూచనలు పాటించలేదు. దీంతో వ్యాధి క్రమంగా పెరిగి తన నడుము కిందిభాగం అచేతనంగా మారింది. బాల్యంలోనే చక్రాల కుర్చీకి పరిమితమైంది. తన స్నేహితులందరూ గెంతులేస్తూ ఆడుతుంటే తాను మాత్రం నడవలేకపోతున్నానని బాధ పడేది. ఆ సమయంలో కుటుంబం తనకు అండగా నిలిచింది. భవీనా తండ్రి 2004లో ఆమెను అహ్మదాబాద్‌లోని అంధ ప్రజల సంఘం (బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్- బీపీఏ)లో చేర్పించాడు. అక్కడే ఆమె టీటీ కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. ఫిట్‌నెస్ కోసం సరదాగా టీటీ ఆడడం మొదలెట్టి ఆటపై ప్రేమ పెంచుకుంది. మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.
తొలి ప్లేయర్..
అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తూ ఓ దశలో ప్రపంచ రెండో ర్యాంకునూ చేరుకుంది. ఇప్పుడదే స్ఫూర్తితో పారాలింపిక్స్‌లో పతకం దక్కించుకున్న తొలి భారత టీటీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది. ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన ప్రత్యర్థులను ఓడించి సెమీస్ చేరి పతకం ఖాయం చేసిన ఆమె.. మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగించి పసిడిని అందుకోవాలని పట్టుదలతో ఉంది.
ఇదీ చదవండి: Tokyo Paralympics: భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన భవినా పటేల్