ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానుకు తన స్వరాష్ట్రం మణిపూర్‌లో ఘన స్వాగతం లభించింది. అభిమానుల హర్షాతిరేకాల మధ్య మంగళవారం మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయంలో చాను అడుగుపెట్టింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ ఆమెకు స్వాగతం పలికారు. అక్కడే ఉన్న తన తల్లిని చూసి ఆనందంతో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది చాను.
అనంతరం మణిపూర్ అధికారులు మీరాబాయి కోసం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఆ తర్వాత ఒలింపిక్స్‌లో పతక విజేతగా నిలిచిన అనుభూతిని మీరబాయి వెల్లడించారు. తన పతకాన్ని మణిపూర్ ప్రజలకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది చాను. ఇన్నేళ్లు తనకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపింది.
అంతకుముందు సోమవారం టోక్యో నుంచి దిల్లీ చేరుకున్న మీరాబాయి చాను.. కోచ్ విజయ్ శర్మతో కలిసి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా అనురాగ్ మాట్లాడుతూ.. "ఒలింపిక్స్ తొలి రోజే పతకం. ఇంతకుముందెవరూ సాధించని ఘనత ఇది. 135 కోట్ల మంది ముఖాల్లో ఆమె నవ్వు తీసుకొచ్చింది. దేశమంతా ఆమెను చూసి గర్విస్తోంది" అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి.. స్వదేశానికి మీరాబాయి.. ఏఎస్పీగా ఉద్యోగం