టోక్యో పారాలింపిక్స్(Tokyo Paralympics 2021) హైజంప్ టీ63 పోటీల్లో అథ్లెట్ మరియప్పన్ తంగవేలు(Mariyappan High Jump) రజత పతకం సాధించాడు. అయితే.. ఈ పోటీల్లో అతను స్వర్ణం సాధిస్తాడని ఆశించినప్పటికీ రెండు కారణాల వల్ల రజతంతో సరిపెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
"ఈ పోటీలో స్వర్ణం సాధిస్తానని అనుకున్నా. కానీ, గ్రౌండ్ కండీషన్ అనుకూలించలేదు. పోటీ జరుగుతున్న సమయంలో వర్షం బాగా పడింది. నా కాలికి ధరించిన సాక్సు పూర్తిగా తడిచిపోయింది. ఈ నేపథ్యంలో పోటీ కష్టంగా మారింది. జంప్ చేసే సమయంలో కాస్త ఇబ్బంది పడ్డా."
--మరియప్పన్ తంగవేలు, అథ్లెట్.
పరిస్థితులు అనుకూలించి ఉంటే.. 1.88 మీటర్ల ఎత్తు అలవోకగా ఛేదించేవాడని మరియప్పన్ కోచ్ ఆర్ సత్యనారాయణ అన్నాడు. మరియప్పన్(Mariyappan Thangavelu).. గతనెల ఎస్ఏఐ బెంగళూరులో 1.98 మీ, 2016 రియో ఒలిపింక్స్‌లో 1.89మీ ఎత్తుకు జంప్ చేశాడని గుర్తుచేశాడు.
హైజంప్ టీ63 విభాగంలో అమెరికా అథ్లెట్ 1.88 మీటర్ల ఎత్తుతో స్వర్ణం సాధించగా.. తంగవేలు 1.86మీటర్లతో రజతం సొంతం చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో భారత అథ్లెట్ శరద్ కుమార్ కాంస్య పతకం దక్కించుకున్నాడు.
రూ. 2 కోట్ల నజరానా..
రజత పతకం సాధించిన తంగవేలుకు(Mariyappan Thangavelu Paralympics 2021) భారీ నజరానా ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. రూ. 2 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. తంగవేలు ప్రదర్శనకు దేశం గర్విస్తోందని అన్నారు.
ఇదీ చదవండి:Tokyo Paralympics: హైజంప్‌లో భారత్‌కు రజతం, కాంస్యం