టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 'స్వర్ణ' ముగింపు పలికింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 120 ఏళ్లుగా నిరీక్షించిన భారతీయుల కల ఫలించింది. జావెలిన్ త్రో ఫైనల్లో గెలిచిన యువ సంచలనం నీరజ్ చోప్రా అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తాడు. ఈ స్వర్ణంతో కలిపి టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఏడుకు (ఓ స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది. ఇప్పటివరకు విశ్వక్రీడల్లో ఇండియాకు ఇదే అత్యుత్తమం.
2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది. తాజా ప్రదర్శనతో.. అథ్లెట్స్ భవిష్యత్త్‌లో దేశానికి మరిన్ని ఎక్కువ సంఖ్యలో మెడల్స్ తీసుకొస్తారనే నమ్మకాన్ని కలిగించారు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఎవరెవరు పతకాలు గెల్చుకున్నారో చూడండి.
మీరాబాయి చాను- రజతం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది మీరాబాయి చానునే. వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది మీరాబాయి చాను. దాదాపుగా 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది.
ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.
పీవీ సింధు- కాంస్యం
ఈ విశ్వక్రీడల్లో భారత్‌కు రెండో పతకాన్ని అందించింది బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు. స్వర్ణం సాధ్యం కాకపోయినా కాంస్య పతకంతో సత్తాచాటింది. ఏకపక్ష పోరులో ఆరో సీడ్ సింధు 21-13, 21-15తో 8వ సీడ్ బింగ్జియావోను (చైనా) ఓడించింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.
లవ్లీనా- కాంస్యం
లవ్లీనా బోర్గొహైన్.. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. 'మాగ్నిఫిసెంట్ మేరీ' తర్వాత పతకం ముద్దాడిన రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో ఆమెకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే! ఎందుకంటే భారత బాక్సింగ్‌కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందించింది. అంతేకాదు.. అరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది.
సెమీస్‌లో లవ్లీనా.. స్వర్ణ పతకానికి ఫేవరెట్ అయినా ప్రత్యర్థి సుర్మెనెలి (టర్కీ)పై 0-5 తేడాతో ఓటమి పాలైనా.. స్ఫూర్తిదాయకంగా పోరాడింది. వరుసగా మూడు రౌండ్లలో సుర్మెనెలి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి రౌండ్లో లవ్లీనా కొన్ని పంచులు బాగానే విసిరింది. వాటిని ప్రత్యర్థి తన డిఫెన్స్‌తో అడ్డుకొంది. దాంతో 50-45తో సుర్మెనెలి మొదటి రౌండ్ గెలుచుకుంది. ఇక రెండో రౌండ్లో ఆమె మరింత రెచ్చిపోగా లవ్లీనా రక్షణాత్మక ధోరణి కనబరిచింది. ఇక చివరి రౌండ్లో ఆమె మరింత తేలిపోయింది. ఆఖరికి 30-26, 30-26, 30-25, 20-25, 30-25 టర్కీ బాక్సర్ ఘన విజయం అందుకుంది. 2008లో విజేందర్, 2012లో మేరీకోమ్ తర్వాత లవ్లీనా (2021) బాక్సింగ్‌లో పతకం అందించడం గమనార్హం.
హాకీ.. 41 ఏళ్ల తర్వాత- కాంస్యం
పసిడి పతకాన్ని తలదన్నేలా జరిగిన పోరులో హాకీ ఇండియా పురుషుల జట్టు దుమ్మురేపింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను అధిగమించింది. పునర్వైభవమే లక్ష్యంగా ఆడిన పోరులో అద్భుత విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది. జర్మనీతో జరిగిన కాంస్య పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. నవ చరిత్రకు నాంది పలికింది. టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్ జీత్ సింగ్ (17, 34 ని), హార్దిక్ సింగ్ (27ని), హర్మన్‌ప్రీత్ సింగ్ (29ని), రూపిందర్ పాల్ సింగ్ (31ని) గోల్స్ చేశారు. జర్మనీలో టిముర్ ఒరుజ్ (2ని), నిక్లాస్ వెలెన్ (24ని), బెనెడిక్ట్ ఫర్క్ (25ని), లుకాస్ విండ్‌ఫెదెర్ (48ని) రాణించారు.
రహి దహియా- రజతం
ఈ మెగాక్రీడల్లో భారత రెజ్లర్ రవి కుమార్ పసిడి కల నెరవేరలేదు. సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన కుస్తీ వీరుడిగా ఖ్యాతి గడించిన రవికుమార్ తుదిపోరులో మాత్రం పరాజయం చవిచూశాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, రష్యా రెజ్లర్ ఉగెవ్ జవుర్ 7-4 తేడాతో రవికుమార్‌పై విజయం సాధించాడు. ఈ ఓటమితో రవికుమార్ రజత పతకానికి పరిమితమయ్యాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 5కు చేరింది.
2020, 2021 ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణపతకం నెగ్గిన రవి కుమార్ దహియా.. 2019 ప్రపంచ రెజ్లింగ్ టోర్నీలో కాంస్యాన్ని నెగ్గాడు. ఆ టోర్నీలో జావుర్ యుగేవ్ చేతిలోనే రవికుమార్ ఓటమి పాలయ్యాడు.
బజరంగ్ పునియా- కాంస్యం
ఈ విశ్వక్రీడల్లో భారత్‌కు ఆరో పతకం అందించాడు టాప్ రెజ్లర్ బజరంగ్ పునియా. రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కజకిస్థాన్‌కు చెందిన నియాజ్బెకోవ్ దౌలెత్ను 8-0 తేడాతో చిత్తుచేశాడు బజరంగ్.
నీరజ్ చోప్రా- స్వర్ణం
భారత యువ ఆటగాడు నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తాడు. ఒకటి.. రెండు.. మూడో కాదు ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం ముద్దాడాడు. స్వతంత్ర భారత దేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు.
ఫైనల్లో మొదటి అవకాశంలోనే నీరజ్ 87.03 మీటర్లు విసిరి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు. ఈ సారి ఈటెను 87.58 మీటర్లు విసిరి పతక పోటీలో ముందుకెళ్లాడు. మూడోసారి మాత్రం 76.79కి పరిమితం అయ్యాడు. ఆ తర్వాత రెండు ఫౌల్స్ పడ్డాయి. ఆరో రౌండ్‌లో 84.24 మీటర్లు విసిరాడు. దీంతో పోటీలో పాల్గొన్న అథ్లెట్లలో అత్యధిక మీటర్లు (87.58 మీటర్లు) విసిరిన ఆటగాడిగా నిలిచి స్వర్ణ పతకం గెల్చుకున్నాడు. నీరజ్ తర్వాత చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్కు(86.67 మీటర్లు) రజతం దక్కగా, అదే దేశానికి చెందిన మరో అథ్లెట్ విటెడ్జ్స్లావ్కు (85.44 మీటర్లు) కాంస్యం సొంతమైంది.
ఇదీ చూడండి: పతకాల్లో అగ్రస్థానం దక్కేది ఎవరికి?