టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్కు కోటి రూపాయిలు అందించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. అసోంకు చెందిన 'లవ్లీనా'కు గువాహటిలో గురువారం సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా.. ఆమెకు పోలీసు శాఖలో డీఎస్పీ పదవి ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం.
ఆమె స్వగ్రామం గోలాఘట్లో లవ్లీనా పేరుతో ఓ స్టేడియం నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. గువాహటిలోని ఓ రోడ్డుకూ లవ్లీనా పేరు పెట్టనున్నట్లు కూడా ప్రకటించారు. ఆమెకు శిక్షణనిచ్చిన నలుగురు కోచ్‌లకూ రూ. 10 లక్షల చొప్పున అందించారు.
సీఎం స్వయంగా వెళ్లి..
ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత తొలిసారి గువాహటి చేరుకున్న లవ్లీనాకు అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రే స్వయంగా విమానాశ్రాయనికి వెళ్లి ఆమెకు ఆహ్వానం పలకడం విశేషం. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆమెను నగరానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లవ్లీనాను ఘనంగా సన్మానించారు. ఆమె గ్రామం ఉండే నియోజకవర్గంలో సారుపతర్‌లో బాక్సింగ్ అకాడమీతో పాటు ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్టు సీఎం హామీ ఇచ్చారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడతామన్నారు.
అసోం నుంచి తొలి ఒలింపిక్ మెడల్ సాధించింది లవ్లీనానే. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం సాధించే విధంగా ప్రోత్సాహం అందించడానికి.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 వరకు ఆమెకు ప్రతి నెలా రూ. లక్ష చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వనుంది.
బంగారం తీసుకొస్తా..
పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా బంగారు పతకం గెలవడానికి కృషి చేస్తానని తెలిపింది లవ్లీనా. టోక్యోలోనూ స్వర్ణం గెలిచేందుకు కష్టపడ్డానని, అయితే ఫలితం ప్రతికూలంగా వచ్చిందని పేర్కొంది.
ఇదీ చూడండి: Tokyo Olympcis 2020: మెడల్స్ టేబుల్లో చైనా మాయ!