అవసరమైతే ఖాళీ స్టేడియంలో ఆడేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని అంటోంది భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. కరోనా ప్రభావం తగ్గినా, క్రీడాపోటీలకు అభిమానులను అనుమతించే పరిస్థితి ఇప్పుడిప్పుడే ఉండకపోవచ్చన్న అంశంపై ఓ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడింది.
"అభిమానుల కేరింతల నడుమ కోర్టులో అడుగుపెడుతుంటే ఆ అనుభూతే వేరు. దాన్ని మరేదీ భర్తీ చేయలేదు. అభిమానులు లేకుండా ఆడలేమని అంటే ప్రత్యామ్నాయం ఏంటి? టెన్నిస్ సహా మరే క్రీడ ఆడే అవకాశం ఉండదు. అయితే అది సరైన పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం. ఖాళీ స్టేడియంలో ఆడటం వ్యక్తిగతంగా నాకెలాంటి సమస్య కాదు. నా దృష్టిలో ప్రయాణం.. టోర్నీకి చేరుకోవడమే పెద్ద సమస్య. రెండు వారాల ముందే అక్కడికి వెళ్లడమంటే సులువైన విషయం కాదు. ఏదేమైనా ఖాళీ స్టేడియంలో ఆడేందుకు నేను సిద్ధం. టెన్నిస్‌లో పునరాగమనం కోసం రెండేళ్లు కష్టపడ్డా. బిడ్డకు జన్మనిచ్చి అన్ని అవాంతరాలు అధిగమించాను. ఇప్పుడు అర్ధంతరంగా ఆగిపోయా. మళ్లీ టెన్నిస్ ఆడేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే. నిజానికి 2020 టోక్యో ఒలింపిక్స్ ఆడాలన్న ఉద్దేశంతోనే పునరాగమనం చేశా. ఒలింపిక్స్ వాయిదా పడటం నాకు ప్రతికూలమే. వచ్చే ఏడాదికి నా వయసు ఓ సంవత్సరం పెరగడం కలిసొచ్చే అంశం కాదు. అయితే ఒలింపిక్స్‌కు ఇంకో ఏడాది సమయముంది. మునుపటిలా ఆడతాననే అనుకుంటున్నా"
-సానియా, భారత టెన్నిస్ క్రీడాకారిణి.
ప్రపంచ నం.2 రఫెల్ నాదల్.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించాడు.
ఇదీ చూడండి : భార్యలతో హెయిర్‌కట్ చేయించుకోవడం సాహసమే!