18 గ్రాండ్‌స్లామ్‌ల విజేత స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. యూఎస్ ఓపెన్‌లో అదరగొట్టాడు. సెమీస్‌లో ఇటలీకి చెందిన మాటియో బెరెట్టిని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నెగ్గి 5వ సారి యూఎస్ఫైనల్లో ఆడనున్నాడు.
మాటియోపై 7-6, 6-4, 6-1 తేడాతో వరుస సెట్లలో నెగ్గి ముందంజ వేశాడు రఫా. రెండు గంటల 34 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది.
తొలి సెట్లో ఇరువురు హోరాహోరీగా పోరాడారు. అయితే రఫాను నిలువరించలేకపోయాడు మాటియో. రెండో సెట్లోనూ బలమైన పోటీనిచ్చినప్పటికీ స్పెయిన్‌బుల్ అతడికి అవకాశమివ్వలేదు. మూడో సెట్లో సులభంగా నాదల్కు లొంగిపోయాడు మాటియో.
"మొదటి సెట్లో కొంచెం విసుగొచ్చింది. అయితే టై బ్రేక్‌లో అదృష్టం కలిసివచ్చి గెలవగలిగాను. అతడు(మాటియో) అద్భుతంగా పోరాడాడు. మళ్లీ యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది" -రఫెల్ నాదల్
మరో సెమీస్‌లో బల్గేరియా ఆటగాడు దిమిత్రోవ్‌పై నెగ్గి ఫైనల్కొచ్చాడు రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్. క్వార్టర్స్‌లో రోజర్‌కు షాకిచ్చిన ఈ రష్యన్ ప్లేయర్ తుదిపోరులో నాదల్ జోరుకు అడ్డుకట్టవేసి టైటిల్ నెగ్గాలని తహతహలాడుతున్నాడు. ఆదివారం నాదల్ - మెద్వదేవ్ మధ్య యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇది చదవండి: పట్టుబిగిస్తున్న ఆసీస్.. ఇరకాటంలో ఇంగ్లాండ్