ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారిణులు మట్టికరిచారు. నంబర్ వన్ స్థానంలో ఉన్న ఒసాకా (జపాన్) జోరుకు అడ్డుకట్టవేసింది కేథరిన్. మరో స్టార్ సెరెనాను ఇంటికి సాగనంపింది కెనిన్ (అమెరికా). మరోవైపు హలెప్, జకోవిచ్, సిట్సిపాస్, మోన్‌ఫిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు.
టైటిల్ ఫేవరెట్ ఇంటికి...
ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్‌సీడ్ నవోమి ఒసాకా (జపాన్) ఇంటి ముఖం పట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఒసాకా 4-6, 4-6తో కేథరిన్ సినియాకోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది.
తొలి రెండు రౌండ్లలో అతికష్టం మీద గట్టెక్కిన ఒసాకా.. మూడో రౌండ్లో మాత్రం పోరాటపటిమ చూపలేకపోయింది. తొలి సెట్లో లభించిన ఆరు బ్రేక్ పాయింట్లతో మూడింటిని సద్వినియోగం చేసిన కేథరిన్.. ఒసాకాపై ఆధిక్యాన్ని సాధించింది. రెండో సెట్లోనూ రెండుసార్లు సర్వీస్ కోల్పోయిన ఒసాకా మ్యాచ్‌ను చేజార్చుకుంది.
సెరెనాకు అన్‌సీడెడ్ షాక్...
అమెరికా తార సెరెనా విలియమ్స్ 2-6, 5-7తో అన్‌సీడెడ్ సోఫియా కెనిన్ (అమెరికా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది.
డిఫెండింగ్ ఛాంపియన్ హలెప్ (రొమేనియా) ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో మూడో సీడ్ హలెప్ 6-2, 6-1తో తుర్సెంకోవా (ఉక్రెయిన్)ను ఓడించింది. మాడిసన్ కీస్ (అమెరికా), స్విటెక్ (పోలెండ్) కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. కీస్ 6-3, 6-7 (5-7), 6-4తో బ్లింకోవా (రష్యా)ను ఓడించగా, స్విటెక్ 0-6, 6-3, 6-3తో మోనికా ప్యూగ్ (ఫ్యూర్టొరికొ)పై విజయం సాధించింది.