ఆస్ట్రియా కుర్రాడు డొమినిక్ థీమ్ ఏటీపీ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అతను 7-5, 6-7 (10/12), 7-6 (7/5)తో ప్రపంచ నంబవర్‌వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు.
తొలి సెట్ ఆరంభంలో ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు ఆడినా పదకొండో గేమ్‌లో బ్రేక్ సాధించిన థీమ్ 7-5తో సెట్ గెలిచాడు. కానీ రెండో సెట్లో జకో మరింత గట్టిగా పోరాడాడు. కానీ డొమినిక్ కూడా తగ్గకపోవడం వల్ల సెట్ టైబ్రేకర్‌కు వెళ్లింది. ఒక దశలో టైబ్రేకర్‌లో థీమ్‌కు గెలిచేందుకు అవకాశం వచ్చింది. కానీ నాలుగు మ్యాచ్ పాయింట్లను కాచుకున్న నొవాక్.. ఈ సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు.
ఎవరి సర్వీసులు వాళ్లు నిలబెట్టుకుంటూ వెళ్లడంతో మూడో సెట్ కూడా టైబ్రేకర్‌కు మళ్లింది. అయితే ఆరంభంలో 0-4తో వెనకబడినా.. గొప్పగా పుంజుకున్న థీమ్ 7-6 (7-5)తో సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో తుది పోరుకు వెళ్లడం అతనికిది వరుసగా రెండోసారి.