పాకిస్థాన్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టోర్నీలో భారత్ పాల్గొననుందా..? లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. 55 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ కోసం దాయాది దేశంలో పర్యటించాలనుకుంది భారత టెన్నిస్ జట్టు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సందిగ్ధం నెలకొంది.
కశ్మీర్ అంశం కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టు భద్రత గురించి ఆలోచించాలని స్టార్ ప్లేయర్ మహేశ్ భూపతి... ఇటీవల భారత్ టెన్నిస్ సంఘానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అతడితో పాటు రోహన్ బోపన్న, ఆటగాళ్ల రక్షణ విషయంలో సందేహం వ్యక్తం చేశాడు.
'భద్రతా దృష్ట్యా భయాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు'.
- బోపన్న, భారత్ టెన్నిస్ ప్లేయర్
క్రీడాకారులు లేవనెత్తిన సందేహాలపై స్పందించాడు పాక్ టెన్నిస్ జట్టు కెప్టెన్ ఖురేషి.
"భద్రత అంశం ఎప్పుడూ ముఖ్యమే. అయితే మీరు ఎవరో చెప్పిన మాటలు విని పాక్ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఒకసారి వచ్చి చూస్తే కదా మేం ఇచ్చే రక్షణ గురించి తెలుస్తుంది. మీరు స్వయంగా మా ఆతిథ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. భవిష్యత్తు గురించి ఎవరూ చెప్పలేం. పాకిస్థాన్ ప్రేమించే దేశమని.. ఇక్కడ ప్రజలు అభిమానంతో ఉంటారని అందరూ అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో మీరు అనుకున్నట్లే ఘటనలు జరుగుతున్నాయి. ఆ కారణంగా మమ్మల్ని తప్పుపట్టొద్దు".
-ఐసమ్ ఉల్ హుక్ ఖురేషి, పాక్ టెన్నిస్ జట్టు కెప్టెన్
ఇస్లామాబాద్ వేదికగా డేవిస్ కప్‌కు అనుమతిచ్చింది అంతర్జాతీయ టెన్నిస్ సంఘం. ఈ టోర్నీకి సంబంధించిన ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా... అన్నింటిలోనూ భారత టెన్నిస్ సంఘానికి పూర్తి బాధ్యతలు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ టోర్నీ ఇరుదేశాలకు చెందింది కాదని.. అంతర్జాతీయంగా జరగుతుందనే కారణంతోనే భారత్ ఇందులో పాల్గొనటానికి అంగీకరించింది.
ఎంపిక పూర్తి....
డేవిస్ కప్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించింది భారత టెన్నిస్ సంఘం. ఆరుగురు సభ్యులతో కూడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. సింగిల్స్ విభాగంలో భారత టాప్ క్రీడాకారులు ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామ్‌నాథన్, సాకేత్ మైనేని ఎంపికయ్యారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ జోడి చోటు దక్కించుకుంది.
ఇదీ చూడండి: లద్దాఖ్‌లో జెండా ఎగరవేయనున్న ధోనీ..!