భారత్.. పాకిస్థాన్‌తో డేవిస్‌కప్ పోరుకు సిద్ధమైంది. అసాధారణ రీతిలో ఎనిమిది మందితో కూడిన జట్టును ప్రకటించింది. పాక్‌లో ఆడేందుకు తిరస్కరించిన ఆటగాళ్లతో పాటు, వేదికతో సంబంధం లేకుండా సెలక్షన్‌కు అందుబాటులో ఉన్న వారు ఈ జట్టులో ఉన్నారు. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్.. ఏడాది తర్వాత పునరాగమనం చేశాడు. చివరగా అతడు.. 2018 ఏప్రిల్‌లో డేవిస్‌కప్ మ్యాచ్ ఆడాడు. సుమిత్ నగల్, రామ్‌కుమార్ రామనాథన్, శశి కుమార్ ముకుంద్, రోహన్ బోపన్నలూ జట్టులో ఉన్నారు. భద్రత కారణాల రీత్యా పాకిస్థాన్ వెళ్లడానికి ఈ నలుగురు తటపటాయించారు.
"ఇది ప్రత్యేక సందర్భం. సాధారణంగా ఇంత ఎక్కువ మందితో జట్టును ఎంపిక చేయం. కానీ పాకిస్థాన్ వెళ్లడానికి సిద్ధపడిన ఆటగాళ్లలో.. తమను పక్కన పెట్టేశారన్న భావన కలగొద్దని భావించాం" -జీషన్ అలీ, కోచ్-సెలక్షన్ కమిటీ సభ్యుడు
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో జీవన్ నెదుంచెజియన్, సాకేత్ మైనేని, సిద్ధార్థ్ రావత్‌లు ఇతర సభ్యులు. భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేయడం వల్ల డేవిస్‌కప్ పోరు వేదికను మార్చాలని ఐటీఎఫ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి: డేవిస్ కప్‌లో ఆడుతున్నా.. నేనే సారథిని: మహేశ్ భూపతి