టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) సూపర్ 12 మ్యాచ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌ను (Ind Vs Nz) ఢీకొంటుంది. గత ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన కోహ్లీసేన.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కివీస్‌పై గెలిచి రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. అయితే క్రికెటర్ల ప్రదర్శనతో పాటు టాస్ (Ind Vs Nz Toss) గెలవడం కూడా విజయంలో కీలకంగా మారింది. ఎందుకంటే.. టాస్ గెలిస్తే సగం పనైట్లే. ఈ ప్రపంచకప్‌లో పరిస్థితిది.
టాస్ నెగ్గితే జట్లు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి. అది ఆ జట్లకు చాలా కలిసొస్తోంది. ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన 20 మ్యాచ్‌ల్లో 14 సార్లు ఛేదించిన జట్లే గెలిచాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో కూడా టాస్ చాలా కీలకమే అనడంలో సందేహం లేదు. ఒకవేళ టాస్ ఓడి బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారత్.. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడుతుందో చూడాలి.
హార్దిక్ ఉంటాడా?
పాక్‌తో మ్యాచ్‌లో పరాభవం తర్వాత భారత జట్టులో అత్యంత విమర్శలు ఎదుర్కొన్నది హార్దిక్ పాండ్యనే (Hardik Pandya News). అతను చాన్నాళ్లుగా పేరుకే 'ఆల్‌రౌండర్'గా ఉంటున్నాడు. కానీ బౌలింగ్ చేయట్లేదు. కేవలం బ్యాటింగ్‌తో జట్టులో ఉండేంతగా అతనేమీ మెరుపులు మెరిపించట్లేదు. పాక్‌తో మ్యాచ్‌లోనూ తేలిపోయాడు. హార్దిక్ బౌలింగ్ చేయనపుడు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంచుకోవచ్చు. బౌలింగే ప్రధానమనుకుంటే కావాలనుకుంటే కాస్త బ్యాటింగ్ చేయగల శార్దూల్ ఠాకూర్‌ను లేదా అశ్విన్‌ను తీసుకోవచ్చు. మరి కివీస్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌పై వేటు పడుతుందా.. లేక హార్దిక్‌కు ఇంకో అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. కోహ్లి మాటల్ని బట్టి చూస్తే హార్దిక్ ఆడే అవకాశముంది. నెట్స్‌లో బౌలింగ్ కూడా చేశాడు కాబట్టి ఈ మ్యాచ్‌లో అతను ఆడితే కచ్చితంగా బంతి పట్టుకునే అవకాశముంది.
ఇవీ విశేషాలు..
- 3-బౌల్ట్, సౌథీ, శాంట్నర్ టీ20 క్రికెట్లో తలో మూడుసార్లు రోహిత్‌ను ఔట్ చేశారు.
- 4-షమి నాలుగుసార్లు విలియమ్సన్‌ను ఔట్ చేశాడు.
- 2016 వరకు టీ20ల్లో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఆ తర్వాత 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓడిపోయింది.
ఇదీ చూడండి: T20 World Cup: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్.. కీలక పోరులో గెలిచేదెవరో?