టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు సమష్టిగా రాణిస్తూ ముందుకు సాగుతోందని, కెప్టెన్ కేన్ విలియమ్సన్ సమర్థ నాయకత్వం వల్లే కివీస్ గొప్ప విజయాలు సాధిస్తోందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. 'కివీస్ ఆటగాళ్లంతా.. వారి ప్రదర్శనపై చాలా నమ్మకంతో ఉన్నారు. చాలా చిన్న దేశం నుంచి వచ్చినా.. వారంతా సమష్టిగా రాణిస్తూ గొప్ప విజయాలను అందుకొన్నారు. బుధవారం జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో.. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా బ్యాటర్లు ఏమాత్రం నిరాశ చెందలేదు. నిలకడగా ఆడుతూ కెప్టెన్ ఆశల్ని నిలబెట్టారు. కెప్టెన్ విలియమ్సన్ జట్టులోని ప్రతి ఆటగాడిని గౌరవిస్తాడు.' అని సునీల్ గావస్కర్ చెప్పాడు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా మలుచుకుంటాడని.. అందుకే న్యూజిలాండ్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే అలవోకగా విజయం సాధించిందని పేర్కొన్నాడు. విలియమ్సన్ వంటి గొప్ప నాయకుడి చేతిలో జట్టు పగ్గాలుండటం వల్లే ఇది సాధ్యమయిందిని.. అందుకే, ప్రస్తుత క్రికెటర్లలో అతనో లెజెండ్ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
అబుదాబి వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీస్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ జిమ్మీ నీషమ్‌పై కూడా సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన అతడు ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాడని అభినందించాడు. నీషమ్ 11 బంతుల్లో 27 పరుగులు చేసి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. 'నీషమ్.. ఇంగ్లాండ్‌పై గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 240కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం సాధారణ విషయం కాదు. అతడి వీర బాదుడుకుతోడు కొంచెం అదృష్టం కూడా కలిసొచ్చింది. అన్నింటికన్నా కెప్టెన్ విలియమ్సన్‌కి అతడిపై నమ్మకమెక్కువ. అందుకే విధ్వంసకర బ్యాటర్లున్న ఇంగ్లాండ్ లాంటి జట్టుపై అతడితో చివరి ఓవర్ బౌలింగ్ చేయించాడు. ఏదేమైనా అతడు తన టాలెంట్‌కి న్యాయం చేశాడనిపిస్తోంది' అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి : 'కర్మ హిట్స్ బ్యాక్'.. అప్పుడు కివీస్.. ఇప్పుడు ఇంగ్లాండ్!