తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్.. స్కాట్లాండ్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 85 పరుగులకే కుప్పకూలగా.. భారత్ రెండు వికెట్ల నష్టానికి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్‌ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ (50: ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), రోహిత్ శర్మ (30: ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే విజయానికి ఇంకో పదహారు పరుగులు అవసరమైన సమయంలో రోహిత్‌ను స్కాట్లాండ్ బౌలర్ వీల్ వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (2*), సూర్యకుమార్ యాదవ్ (6*) మిగిలిన పనిని పూర్తి చేసేశారు. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ (4 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ను.. టీమ్‌ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ (3/14), జడేజా (3/15) దెబ్బ తీశారు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ నిర్దేశించింది. జార్జ్ మున్సీ (24), లీస్క్ (21) కాస్త ఫర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారు. రిచీ బెరింగ్‌టన్, షరిఫ్, ఈవన్స్ పరుగులేమీ చేయకుండా ఔట్ అయ్యారు. కెప్టెన్ కోట్జర్ (1), క్రాస్ (2), గ్రీవ్స్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. మెక్‌లాయిడ్ 16, వాట్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా 3.. బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
మెరుగైన నెట్‌రన్‌రేట్..
86 పరుగుల లక్ష్యాన్ని 11.2 ఓవర్లలోపే ఛేదిస్తే.. టీమ్‌ఇండియా నెట్‌రన్‌రేట్ +1.000లోకి వచ్చేస్తుంది. 7.1 ఓవర్లలోపే ఛేదిస్తే అఫ్గానిస్థాన్ (+1.481)ను దాటేస్తుంది. ఇప్పుడు.. 6.3 ఓవర్లలోనే టీమ్‌ఇండియా మ్యాచ్‌ను ముగించేయడం వల్ల నెట్‌రన్‌రేట్ మరింత మెరుగైంది. ఏకంగా +1.619కు చేరుకుంది. దీంతో అఫ్గానిస్థాన్‌ను వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది భారత జట్టు.