2024 టీ20 ప్రపంచకప్‌నకు (2024 T20 World Cup) అమెరికా అతిథ్యమిచ్చే అవకాశముంది. 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం (Cricket in Olympics) చేసేందుకు ఇది దోహదం చేస్తుందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది ఐసీసీ. అందులో భాగంగానే యూఎస్ఏ క్రికెట్, క్రికెట్ వెస్టిండీస్ సుంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించేందుకు అవకాశం ఇవ్వనుందని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు (Cricket in Olympics News) ఒక్కసారి మాత్రమే జరిగాయి. అది 1900 పారిస్‌లో. అదే చివరిది కూడా. ఈ ప్రయత్నం ఫలిస్తే విశ్వక్రీడల్లో 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ భాగం కానుండటం విశేషం.
2024 టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు, 55 మ్యాచ్‌లు ఉంటాయని సమాచారం. 2021, 2022 ఎడిషన్లలో 16 జట్లతో 45 మ్యాచ్‌లను ఆడించారు.
నేడే ఫైనల్..
2021 టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) ఆదివారం(నవంబరు 14).. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (NZ vs Aus Final) ఫైనల్లో తలపడనున్నాయి. తొలిసారి పొట్టి ప్రపంచకప్ ముద్దాడాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. కివీస్ తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా.. ఆసీస్‌కిది రెండో ఫైనల్. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన కివీస్.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది.
ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆసీస్.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది. కుదిరిన కూర్పుతో ఆసీస్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. జట్టులోని ఆటగాళ్లు గత మ్యాచ్‌ల్లో తమ పాత్రలను సమర్థంగా పోషించారు. ఇక కివీస్‌కు కాన్వే దూరమవడం వల్ల దెబ్బ పడింది. ఆసీస్ బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతుండగా.. కివీస్ బౌలింగ్‌నే ఎక్కువగా నమ్ముకుంది.
వీళ్లు నిలబడితే..
బ్యాటింగ్‌లో ఆసీస్‌కు వార్నర్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, వేడ్ కీలకం కానున్నారు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడడమే ఆసీస్‌కు కలిసొచ్చింది. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఆ జట్టు నాలుగు సార్లు పవర్‌ప్లేలో 50కి పైగా పరుగులు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్ ఆ జట్టుకు కొండంత బలం. టోర్నీకి ముందు పేలవ ఫామ్‌లో ఉన్న అతనిప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. భారీ షాట్లు ఆడడమే లక్ష్యంగా కాకుండా చివరి వరకూ ఉండి జట్టుకు విజయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా గేర్లు మార్చి బ్యాటింగ్ చేస్తున్నాడు. స్పిన్నర్లపైనా ఆధిపత్యం చలాయిస్తున్నాడు. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 236 పరుగులతో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఇప్పటివరకూ బ్యాటింగ్‌లో రాణించకపోయినా మ్యాక్స్‌వెల్‌ను తక్కువ చేసి చూడలేం. అతను ఒక్కసారి లయ అందుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్ గమనాన్ని మారుస్తాడు. సెమీస్‌లో పాక్‌పై స్టాయినిస్, వేడ్ అద్భుత పోరాటంతో జట్టును గెలిపించారు. ముఖ్యంగా వేడ్ సంచలన ఇన్నింగ్స్‌తో జోరందుకున్నాడు. మరోవైపు కెప్టెన్ ఫించ్ ఫామ్ ఆందోళన కలిగించేదే. కానీ కివీస్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు (251) చేసిన ఆసీస్ ఆటగాడిగా కొనసాగుతున్న అతను.. మరోసారి ఆ జట్టుపై రాణిస్తాడేమో చూడాలి.
కివీస్ బ్యాటింగ్ భారం గప్తిల్, మిచెల్, విలియమ్సన్, నీషమ్‌పై ఉంది. ఈ ఏడాది ఆసీస్‌పై మంచి ప్రదర్శన చేయడంతో పాటు స్పిన్‌ను సమర్థంగా ఆడే కాన్వే గాయంతో ఫైనల్లో ఆడలేకపోవడం లోటే. అతని స్థానంలో సీఫర్ట్ జట్టులోకి రానున్నాడు. గప్తిల్ మరోసారి కంగారూలపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఫార్మాట్లో ఆసీస్‌పై అత్యధిక పరుగులు (435) చేసిన కివీస్ ఆటగాడతనే. ఫైనల్లో కెప్టెన్ విలియమ్సన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై చెలరేగిన నీషమ్‌పై మంచి అంచనాలున్నాయి.
ఇదీ చూడండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా?