తెలుగమ్మాయి యర్రాజి జ్యోతి చరిత్ర సృష్టించింది. దాదాపు పద్దెనిమిదేళ్లుగా పదిలంగా ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. సీనియర్ మహిళల 100మీ. హర్డిల్స్‌లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 100మీ. హర్డిల్స్‌లో 13.037 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె 2002లో అనురాధ బిస్వాల్ (13.38సె) నెలకొల్పిన రికార్డును తిరగరాసింది.
సప్న కుమారి (13.23సె- ఝార్ఖండ్), అపర్ణ (13.55సె- కేరళ) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరపున బరిలో దిగిన ఆమె చిరుతలా పరుగెత్తి మీట్ రికార్డు (13.72సె)తో పాటు జాతీయ రికార్డును చెరిపేసి సంచలనం నమోదు చేసింది. 13.94 సెకన్ల టైమింగ్‌తో జూనియర్ మహిళల 100మీ. హర్డిల్స్‌లోనూ తను పసిడి కైవసం చేసుకుంది.
"రేసులో అగ్రస్థానంలో నిలవడంపైనే దృష్టి పెట్టా. కానీ పరుగు పూర్తయ్యాక మీట్ రికార్డుతో పాటు జాతీయ రికార్డూ బద్దలు కొట్టాననే విషయం తెలిసి చాలా ఆనందమేసింది. మాది పేద కుటుంబమే. పరుగులో ఈ స్థాయికి చేరడం వెనక నా శ్రమతో పాటు మా కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మానాన్నతో పాటు మా అన్నయ్య నాకు అండగా నిలిచాడు. జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ ఆర్థికంగా అండగా నిలవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. కొంచెం సాయం చేస్తే మరింత మంచి ఫలితాలు సాధిస్తా. ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించడమే ధ్యేయంగా పెట్టుకున్నా."
- జ్యోతి
కేరాఫ్ కంచరపాలెం..
పేదరికం ఆమె విజయానికి అడ్డు రాలేదు.. సౌకర్యాలు కరవైనా తన పరుగు ఆగలేదు. లక్ష్యాన్ని చేరాలన్న తపన.. ఆశయాన్ని నేరవేర్చుకోవాలన్న కసి.. తనలో పట్టుదలను పెంచాయి.. కాళ్లకు వేగం నేర్పాయి.. కళ్లలో ధైర్యాన్ని నింపాయి. అనుకున్నది సాధించాలంటే ఉండాల్సింది.. ఆస్తిపాస్తులు కాదు.. ఆత్మవిశ్వాసమని ఆమె చాటింది. ట్రాక్‌పై మనసు పెట్టింది.. గమ్యం దిశగా పరుగు పెట్టింది.. జాతీయ రికార్డును తిరగరాసి చరిత్ర సృష్టించింది. ఆమే.. విశాఖ జిల్లా కంచెరపాలెం యువ అథ్లెట్ 20 ఏళ్ల జ్యోతి యర్రాజి.
అమ్మానాన్నా పనికి వెళ్లి కుటుంబాన్ని నెట్టుకు రావడం.. పిల్లలు ఉన్నదాంట్లో సంతృప్తి చెందడం.. తమ ఆశల్ని, కలల్ని పక్కన పెట్టేయడం.. ఇదీ పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సాధారణంగా కనిపించే పరిస్థితి. కానీ జ్యోతి అందుకు భిన్నం! కుటుంబ పరిస్థితిని మార్చాలనుకుంది. రేపటి తరానికి మెరుగైన జీవితాన్ని అందించాలనుకుంది. దానికి ఆమె కష్టపడడం ఒకటే మార్గమని తలచింది. పరుగును కెరీర్‌గా ఎంచుకొని.. ఉన్నత శిఖరాలకు ఎదిగి.. ఓ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆమె.. ఇప్పుడు జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగేలా చేసింది.
భయపడి.. వద్దన్నారు..
జ్యోతి తండ్రి సూర్యనారాయణ విశాఖపట్నంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అన్నయ్య కారు డ్రైవర్. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆమె జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుతోంది. ఇందుక్కారణం.. ఆమె పరుగే. పదో తరగతి (2015)లో పోర్టు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడి సూచనతో మొదలైన ఆ పరుగు క్రమంగా వేగం పెరుగుతూ పోతోంది. మొదటి నుంచి హర్డిల్స్‌పైనే దృష్టి పెట్టిన ఆమె తక్కువ కాలంలోనే ట్రాక్‌పై పట్టు సాధించింది.
2016లో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శాప్ కోచ్‌ల ఆధ్వర్యంలో మరింత రాటుదేలింది. అయితే హాస్టల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్న సమయంలో కుటుంబంతో దూరంగా ఉండాల్సి రావడంతో ఆమె తల్లిదండ్రులు భయపడి.. పరుగు వద్దంటూ తనను వెనక్కు రప్పించే ప్రయత్నం చేశారు. కానీ జ్యోతి వాళ్లకు ధైర్యం చెప్పింది. ఇక మీట్స్‌లో గెలిచిన కూతురి ఫోటోలు వార్తా పత్రికల్లో రావడంతో తల్లిదండ్రులకు ఆమెపై పూర్తి నమ్మకం వచ్చింది.
విదేశీ కోచ్‌ల శిక్షణలో:
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత అక్కడి విదేశీ కోచ్‌ల శిక్షణలో తన టైమింగ్‌ను మరింత మెరుగుపరుచుకుంది. గత ఏడాది సీనియర్ అంతర్ జిల్లా అథ్లెటిక్స్ మీట్‌లో పసిడి కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ ఆమె జాతీయ స్థాయిలో 15 పతకాలు నెగ్గింది. ప్రస్తుతం బీఏ మొదటి ఏడాది చదువుతోన్న జ్యోతి.. ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడమే తన జీవిత లక్ష్యమని చెబుతోంది.