Wrestlers Protest Issue : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలపై 1983 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టు స్పందించింది. రెజ్లర్లకు తాము మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించింది. "మా ఛాంపియన్ రెజ్లర్లపై ప్రభుత్వం, పోలీసులు ప్రవర్తిస్తున్న అసభ్య తీరును చూస్తుంటే మాకు చాలా బాధ కలుగుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయాలనే ఆలోచన మమ్మల్ని కలవరపరిచింది. ఎన్నో సంవత్సరాల కష్టపడితే గానీ ఆ పతకాలు మీకు రాలేదు. అవి రావడంలో మీతో పాటు ఎందరో త్యాగం, కృషి, దృఢ విశ్వాసం, సంకల్పం కలిగి ఉన్నాయి. ఈ పతకాలు మీ గెలుపు మాత్రమే కాదు, దేశానికి కూడా ఎంతో గర్వకారణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మేము మల్లయోధులను కోరుతున్నాం. అలాగే వారు లేవనెత్తుతున్న అంశాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని త్వరగా సమస్యకు ముగింపు పలకాలని మేము కోరుతున్నాము. చట్టం తన పని తాను చేస్తుంది" అంటూ ప్రకటనను విడుదల చేసింది.
"మల్లయోధులు చేస్తున్న నిరసనలు చాలా బాధకరం. వారు తమ పతకాలను గంగా నదిలో పారవేయాలనే నిర్ణయం నన్ను బాధ కలిగించింది. ఒక పతకం సాధించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వాటి వెనక ఎందరో కృషి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని మేము సమర్థించటం లేదు. వీలైనంత త్వరగా ప్రభుత్వం కూడా వారి సమస్యలను పరిష్కరించాలి."
- మదన్ లాల్, 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు
రెజర్ల కంట 'గంగ'!
గత ఆదివారం రెజ్లర్లు నూతన పార్లమెంట్ భవనం ముట్టడికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే కుస్తీ యోధులు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు అనుమతిని నిరాకరించారు. ఈ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. తాము సాధించిన పతకాలను గంగానదిలో కలిపేందుకు సిద్ధమయ్యారు. గత మంగళవారం వారు ఆ ప్రకటన చేయగా.. రైతు సంఘాల విజ్ఞప్తితో దానిని ఐదు రోజులకు వాయిదా వేశారు.
రెజర్ల బ్యానర్‌పై 'సచిన్' ప్రత్యక్షం!
ముంబయి బాంద్రా వెస్ట్ పెర్రీ క్రాస్ రోడ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఇంటి బయట ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ బ్యానర్‌పై దిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు సంబంధించిన ఫొటోల పక్కన సచిన్ చిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ముంబయి యూత్ కాంగ్రెస్ నేతలు. 'క్రీడా రంగంలో ఉన్నావారు మిమ్మల్ని దేవుడిలా భావిస్తారు. మీరు కూడా అదే రంగంలో ఉన్నారు కదా.. మరి మహిళా కుస్తీ యోధులు చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారు?' అని బ్యానర్‌పై రాశారు.