టోక్యో ఒలింపిక్స్‌లో తనపై వచ్చిన ఆరోపణల గురించి మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్పందించింది. సహచర అథ్లెట్లతో కలిసి ఉండకపోవడానికి గల కారణాలు వెల్లడించింది.
ఏడాది కాలంలో రెండుసార్లు కొవిడ్ బారిన పడిన కారణంగానే.. ఒలింపిక్స్‌లో సహచరులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వినేశ్ వివరించింది. ఒలింపిక్స్‌కు ముందు ప్రాక్టీస్ కోసం హంగేరీ వెళ్లిన ఆమె.. ఈవెంట్ సమయానికి టోక్యో చేరుకుంది. కొవిడ్ నుంచి కోలుకున్నా తర్వాత తనకు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చాయని, తన వల్ల తోటి అథ్లెట్లు ఇబ్బంది పడకూడదనే అలా వ్యవహరించినట్లు స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టులో తొలిసారి కరోనా బారిన పడింది వినేశ్. ఈ ఏడాది కజకిస్థాన్ ఆల్మటీ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్షిప్స్ తర్వాత ఆమెకు మరోసారి కొవిడ్ సోకింది.
![Vinesh Phogat Explains Why She Did Not Stay with Indian Team at Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12761613_shu.jpg)
"ఇప్పటికే నేను రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డాను. పైగా హంగేరీ నుంచి టోక్యోకు చేరుకున్నాను. వచ్చే క్రమంలో నాకు వైరస్ సంక్రమిస్తే అది తోటి వాళ్లకు సోకే అవకాశం ఉంది. అప్పటికే భారత అథ్లెట్లు వారం రోజుల పాటు ప్రతిరోజు కొవిడ్ టెస్టు చేయించుకుంటున్నారు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే రెండు మూడు రోజుల వరకు వారితో కలవకూడదని నిర్ణయించుకున్నాను. తర్వాత వారితో ఉండాలనుకున్నాను. అప్పటికే సీమాతో ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాను" అని వినేశ్ చెప్పింది.
ప్రాక్టీస్ కోసం భారత ప్రభుత్వం వెచ్చించిన నిధులను దుర్వినియోగం చేశాడని తన కోచ్ వోల్లర్ అకోస్పై భారత రెజ్లింగ్ సమాఖ్య చేసిన ఆరోపణలపైనా వినేశ్ స్పందించింది. అతడు అలాంటి వాడు కాదని తెలిపింది. ఒలింపిక్స్‌లో పతకం కోసం అతడు చాలా కష్టపడ్డాడని పేర్కొంది. వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశాడని స్పష్టం చేసింది. తాను క్వార్టర్స్‌లో ఓడిన అనంతరం అతడు చాలా ఏడ్చాడని వినేశ్ చెప్పుకొచ్చింది.
![Vinesh Phogat Explains Why She Did Not Stay with Indian Team at Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12761613_dk.jpg)
"తనపై వచ్చిన ఆరోపణలతో మానసిక క్షోభను అనుభవించానని వినేశ్ వెల్లడించింది. ఇంకా ఆ బాధ నుంచి బయటపడలేదు. సరిగా నిద్ర కూడా పోవట్లేదు. ఒంటరిగా గడుపుతున్నాను. తిరిగి పోటీల్లో ఇప్పట్లో పాల్గొనలేను. నాకు తెలిసి మళ్లీ నేను ఈ ఆటలో కనిపించకపోవచ్చు" అని వినేశ్ తెలిపింది.
![Vinesh Phogat Explains Why She Did Not Stay with Indian Team at Tokyo Olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12761613_sh.jpg)
టోక్యో ఒలింపిక్స్‌లో మూడు విషయాల్లో అమర్యాదగా ప్రవర్తించిందనే కారణంతో వినేశ్‌ను రెజ్లింగ్ నుంచి తాత్కాలికంగా నిషేధించింది భారత రెజ్లింగ్ సమాఖ్య. సహచరులతో కలిసి గదిలో ఉండటానికి నిరాకరించడమే కాకుండా పోటీలో పాల్గొన్నప్పుడు అధికారిక స్పాన్సర్స్ ఇచ్చిన జెర్సీని ధరించలేదని వివరణ ఇచ్చింది. దీనిపై బదులు ఇవ్వడానికి ఆగస్టు 16 వరకు గడువు విధించింది. కానీ, అంతకంటే ముందే వినేశ్ వివరణ ఇచ్చింది.
ఇదీ చదవండి: KUNJA RAJITHA : పట్టు విడువక.. ప్రపంచం వైపు పరుగు తీస్తూ...