భారత రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లు ఒలింపిక్స్ పతకం సాధించే విషయంలో తనకు ప్రేరణగా నిలిచారని రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పింది. 2016 పోటీల్లో కాంస్య పతకం అందుకున్న క్షణాలు తనతో ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేసింది. క్రీడాకారుల కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), రెజ్లింగ్ సమాఖ్యలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొన్న సాక్షి.. వీటిని వెల్లడించింది.

"నా చిన్నతనంలోనే ఆడటం మొదలుపెట్టాను. అప్పట్లో ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్ అంటే అవగాహన కొంచెమే ఉండేది. ఎప్పుడైతే కుస్తీలో అడుగుపెట్టానో జూనియర్ స్థాయి నుంచి ఈ టోర్నీలపై ఆసక్తి పెరిగింది. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లు ఒలింపిక్స్‌లో పతకాలను సాధించడం నాకు ప్రేరణగా నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో నేను ఎప్పుడైతే కాంస్య పతకానికి చేరుకున్నానో.. చివరి మ్యాచ్ వరకు ఓడిపోకూడదని అనుకున్నాను. ప్రత్యర్థి కంటే నేను ఉత్తమ క్రీడాకారిణి అని మా కోచ్ చెబుతూనే ఉన్నాడు. అలా కఠినమైన ఆ మ్యాచ్‌లో విజయం సాధించాను. గెలిచిన అనుభూతిని నా మాటల్లో వర్ణించలేకపోయాను. ఆ సమయంలో నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు"
- సాక్షి మాలిక్, భారత మహిళా రెజ్లర్
"పతకం సాధించిన తర్వాత నా జీవితమే మారిపోతుందని కోచ్ చెప్పారు. కానీ ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ అపురూపమైన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత నాపై ప్రేమ కురిపించిన భారతీయులకు కృతజ్ఞురాలిని" అంటూ చెప్పుకొచ్చింది సాక్షి.

కరోనా సంక్షోభ సమయంలో ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో సాయ్, రెజ్లింగ్ సమాఖ్యలు చూపిన చొరవను సాక్షి మాలిక్ ప్రశంసించింది. దీనివల్ల క్రీడాకారులు ఇంట్లోనే ఉండి, చాలా అంశాలు నేర్చుకొవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి... 'గంగూలీ వ్యాఖ్యలతో యువ క్రికెటర్లకు భరోసా'