రియో ఒలింపిక్స్ పతక గ్రహీత, రెజ్లర్ సాక్షి మాలిక్‌కు షాకిచ్చింది సోనమ్ మాలిక్. లఖ్‌నవూ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సాక్షిని ఓడించి ఫైనల్ చేరింది. తుదిపోరులో రాధికపై 4-1 తేడాతో విజయం సాధించి.. 62 కేజీల విభాగంలో ఒలింపిక్ ట్రయల్స్ కోసం భారత జట్టులో అర్హత సాధించింది.
4-6 తేడాతో వెనుకంజలో ఉన్న సోనమ్.. అనూహ్యంగా పుంజుకుని ఆఖరి మూడు సెకండ్లలో నాలుగు పాయింట్లు సాధించింది. చివరకు 10-10 తేడాతో స్కోరు సమంగా ఉండగా.. మళ్లీ ఆఖరు పాయింట్ సాధించి సాక్షిపై నెగ్గింది.
57 కేజీల విభాగంలో వరల్డ్ ఛాంపియన్షిప్ పతక గ్రహీత పూజా ధందాను ఓడించింది అన్షూ మాలిక్. ఫైనల్లో మానసిపై నెగ్గి సత్తాచాటింది. ఈ టోర్నీలో 53, 68 కేజీల విభాగాల్లో వినేశ్ ఫొగాట్, దివ్య కక్రాన్ విజేతలుగా నిలిచారు. నిర్మలా దేవి, కిరణ్ గోడారా.. 50, 76 కేజీల విభాగాల్లో విజయం సాధించారు.
ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన రెజ్లర్లు ఫస్ట్ ర్యాంకింగ్ సిరీస్(రోమ్ - జనవరి 15-18), ఆసియా ఛాంపియన్షిప్(దిల్లీ- ఫిబ్రవరి 18-23) తలపడతారు. ఈ రెండు టోర్నీల్లో పతకాలు గెలిచిన వాళ్లు మార్చి 27 నుంచి 29 వరకు చైనాలో జరగనున్న ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలకు అర్హత సాధిస్తారు.
ఇదీ చదవండి: '4 రోజుల మ్యాచ్‌ల వల్ల టెస్టు పవిత్రత దెబ్బతింటుంది'