అసలే కరోనా కాలం.. ఎటువైపు నుంచి ఎలా వచ్చి అంటుకుంటుందో ఆ మహమ్మారికే తెలియాలి. ఇలాంటి సమయంలో కొందరు ఆటగాళ్లు ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలు పాటించలేదని.. ఈ మేరకు తమకు ఫిర్యాదు అందినట్లు వెల్లడించింది క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్). ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు.. అథ్లెట్లు తప్పుచేసినట్లు తేలితే క్షమశిక్షణ చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు.
ఇదీ జరిగింది..?
లాక్డౌన్ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఇటీవలే క్రీడా కేంద్రాలు తెరిచేందుకు అనుమతులిచ్చింది ప్రభుత్వం. అప్పట్నుంచి పటియాలాలోని నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా కేంద్రంలోనూ అథ్లెట్లు శిక్షణకు హాజరవుతున్నారు. వారి కోసం అధికారులు కొన్ని నిబంధనలు పెట్టారు. ఎవరైనా శిక్షణ తరగతులకు హాజరయ్యే ముందు.. ఏడు రోజులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది బాక్సర్లు ఈ నిబంధనలు ఉల్లంఘించారని మండిపడింది సాయ్.
"ఘటనపై విచారణకు ఆదేశించాం. ఆటగాళ్లు, అధికారులు ఎవరైనా తప్పుచేసినట్లు తేలితే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏడు రోజులు క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే క్వారంటైన్ పొందిన ఆటగాళ్లతో కలిసినట్లు మాకు ఫిర్యాదు అందింది" అని సాయ్ తెలిపింది.
ఒలింపిక్స్ కోసం సన్నాహాల్లో ఉన్న ఆటగాళ్ల కోసం జులై 8 నుంచే కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌ను కూడా ఓపెన్ చేశారు. ఇందులో తొలుత భారత షూటింగ్ జట్టులోని కీలక ప్లేయర్లకు అవకాశమిచ్చారు. సామాజిక దూరం పాటించడమే కాకుండా ప్రతి ఆటగాడికి థర్మల్ స్క్రీనింగ్, ఆరోగ్య సేతు యాప్ వాడకాన్ని పక్కా చేశారు.