ఒలింపియన్లు, పారాలింపియన్లను జాతీయ శిక్షణా కేంద్రాల్లో కోచ్‌లు, సహాయ కోచ్‌లుగా నియమించనుంది భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్). ఇప్పటికే ప్రారంభమైన ఈ నియామక ప్రక్రియలో భాగంగా 23 నుంచి అసిస్టెంట్ కోచ్‌లు, నలుగురు కోచ్‌లను తీసుకోనున్నారు. ఈ మేరకు సాయ్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఇదీ విధానం..
ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడాకారులు సహాయ కోచ్ పదవికి, పతక విజేతలు నేరుగా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆడుతున్న అథ్లెట్లు, కోచ్‌లుగా ఎంపికైనవారు.. అంతర్జాతీయ స్థాయిలో సమర్థవంతంగా ఆడినంతకాలం తమ కెరీర్‌ను కొనసాగించవచ్చని సాయ్ స్పష్టం చేసింది. కోచ్‌లుగా నియామకం అయినవాళ్లు.. ఎన్ఎస్ఎన్ఐఎస్ నిర్వహించే క్రీడా శిక్షణలో డిప్లొమా చేయాల్సి ఉంటుందని చెప్పింది.
క్రీడాకారుల విజయాలను గుర్తించడానికి క్రీడామంత్రిత్వ శాఖ, సాయ్ నిరంతరం కృషిచేస్తాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు చెప్పారు. "ఒలింపియన్లు, పారాలింపియన్లను కోచ్‌లుగా నియమించడం వారి సేవలను ప్రభుత్వం గుర్తించడమే. శిక్షణ ఇచ్చేందుకు నాణ్యమైన ఆటగాళ్లను తీసుకోవాలనే ఉద్దేశమూ ఉంది. శిక్షణ వ్యవస్థకు కోచులే కీలకం. అత్యుత్తమ ఆటగాళ్లను కోచ్‌లుగా నియమించాల్సిన అవసరం ఉంది" అని రిజుజు అన్నారు.
ఇదీ చూడండి: ఒలింపిక్స్‌పై చెరో మాట.. సందిగ్ధంలో టోర్నీ!