Saff Semi Final 2023 : బెంగళూరులోని కంటెరావా వేదికగా శనివారం జరిగిన దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. హోరా హోరీగా జరిగిన సెమీస్‌లో పెనాల్టీ షూటౌట్లో చెలరేగిన ఛెత్రి సేన 4-2 తేడాతో లెబనాన్ జట్టుపై ఘన విజయాన్నిసాధించింది.
ఈ మ్యాచ్‌లో రెండు జట్లు పోటా పోటీగా తలపడటం వల్ల తొలి అర్ధభాగంలో ఎవరూ సరిగ్గా గోల్స్ చేయలేదు. అయితే విరామం తర్వాతా ఇరు జట్లకు మొదటి గోల్ చేసేందుకు అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోనందున అవి వృథా అయ్యాయి. ఎక్స్ట్రా టైమ్‌లోనూ అదే కథ కొనసాగింది. కానీ భారత ఆటగాళ్లు కొన్ని షాట్లు కొట్టినప్పటికీ.. అవి లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి. దీంతో మ్యాచ్ ఆఖరికి షూటౌట్‌కు దారి తీసింది.
Saff Championship 2023 : షూటౌట్‌లో తొలి షాట్‌నే కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌గా మలచడం వల్ల సక్సెస్ అయ్యాడు. ఇక లెబనాన్ ఆటగాడు హసన్ చేసిన ప్రయత్నాన్ని.. గోల్‌కీపర్ గుర్‌ప్రీత్‌సింగ్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత రెండు షాట్లలో భారత్, లెబనాన్ రెండు జట్లు గోల్స్ చేశాయి. దీంతో ఇరు జట్లు 3 - 2తో నిలిచాయి. ఈ స్థితిలో భారత ఆటగాడు ఉదాంత సింగ్ గోల్ కొట్టగా.. బాబర్ (లెబనాన్) విఫలం కావడం వల్ల తుది విజయం భారత్‌ను వరించింది. టైటిల్ పోరులో కువైట్‌తో ఛెత్రి బృందం జూలై 4న తలపడనుంది. మరో సెమీస్‌లో కువైట్ 1-0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
ఆ రేసులో టాప్..
Sunil Chhetri Goals : ఇక ఇదే వేదికపై గతంలో స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రీ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆసియా ఫుట్‌బాల్‌లో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాళ్లలో ఛెత్రి తన స్థానాన్ని పొందుపరుచుకున్నాడు. ఈ జాబితాలో ఆయన రెండో స్థానానికి చేరుకున్నాడు. బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన శాఫ్ కప్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడం వల్ల అతడి గోల్స్ సంఖ్య 90కి పెరిగింది. అతడికి ఇది 138వ మ్యాచ్. మొక్తార్ దహారి (మలేసియా)ను అతను అధిగమించాడు. దహారి 142 మ్యాచ్‌ల్లో 89 గోల్స్ సాధించగా.. ఇరాన్ ఆటగాడు అలీ డాయ్ 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.