ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌ను భారత్ ఘనంగా ముగించింది. పొలాండ్‌లో జరిగిన పురుషుల 56 కేజీల విభాగంలో సచిన్ స్వర్ణం సాధించాడు. శుక్రవారం ఫైనల్లో అతను 4-1 తేడాతో యెర్బోలాట్ (కజికిస్థాన్)ను చిత్తుచేశాడు. బౌట్ ఆరంభం నుంచి అతను పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. అతని ధాటికి తట్టుకోలేని ప్రత్యర్థి పోరు ముగిశాక రక్తసిక్తమైన ముఖంతో నిష్క్రమించాడు.
2016 తర్వాత ఈ టోర్నీలో స్వర్ణం గెలిచిన తొలి భారత పురుష బాక్సర్‌గా సచిన్ నిలిచాడు. ఇదివరకే ఈ ఛాంపియన్‌షిప్స్‌లో మన అమ్మాయిలు ఏడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్స్‌ను ముగించింది.