తమపై అంతర్జాతీయ డోపింగ్ సంస్థ (వాడా) విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని రష్యా సవాలు చేసింది. రష్యా డోపింగ్ నిరోధక సంస్థ (రుసాడ) పలు ఆధారాలతో ఓ నివేదికను వాడాకు పంపింది. తమపై విధించిన నిషేధాన్ని నిరాకరిస్తున్నట్లు ఇందులో తెలిపింది. ఫలితంగా ఈ విషయం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు చేరనుంది.
"ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను వాడాకు సమర్పించాం. ఆంక్షలను విభేదిస్తున్నామని అందులో పేర్కొన్నాం" -రుసాడా డైరెక్టర్ యూరీ గనస్
అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా రష్యాపై నాలుగేళ్లు నిషేధం విధించింది వాడా. డోపింగ్ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు రష్యా.. మాస్కో ప్రయోగశాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇచ్చినందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2011-15 కాలంలో ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహించిందని మెక్‌లారెన్ స్వతంత్ర నివేదిక 2016లో బయటపెట్టింది.
ఇవీ చూడండి.. బిగ్‌బాష్ లీగ్‌లో అరంగేట్రం స్టెయిన్‌కు ఓ పీడకలే..!