Rafael Nadal Tennis Academy: టెన్నిస్‌లో ఏ క్రీడాకారుడైనా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తే గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం) చర్చ తెరపైకి వస్తుంది. తాజాగా రఫెల్ నాదల్ ఈ రేసులో మిగిలిన ఇద్దరినీ దాటేసి 21 గ్రాండ్‌స్లామ్‌లతో దూసుకెళుతున్నాడు. ఫుట్‌బాలర్ కావాల్సిన నాదల్ తన అంకుల్ ప్రోద్బలంతో రాకెట్ చేతబట్టాడు. ఇప్పుడు టెన్నిస్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. పవర్‌గేమ్‌కు మారుపేరుగా నిలిచిన నాదల్.. మనసు మాత్రం చాలా సున్నితమైంది. ఆర్థిక స్థోమత లేక ఆటలకు దూరమైన పిల్లలకు సాయం చేయడంలో రఫా ముందుంటాడు. అంతేకాదు రఫాకు భారత్‌తో ఆత్మీయ అనుబంధం ఉంది. అది మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో..!
14 ఏళ్ల వయస్సులో కార్లొస్ మోయాపై విజయం..
స్పెయిన్‌లోని మానకోర్‌లో అనా మారియా, సెబాస్టియన్ నాదల్ దంపతులకు 1986లో రఫెల్ జన్మించాడు. సెబాస్టియన్ సోదరులు మిగ్యూల్ నాదల్ (ఫుట్‌బాల్), టోని నాదల్ (టెన్నిస్) జాతీయ స్థాయి క్రీడాకారులే. మిగ్యూల్ ఎఫ్‌సీ బార్సిలోనాకు ఆడాడు. తొలుత రఫాను ఫుట్‌బాలర్‌గా చేయాలనుకున్నారు. కానీ, మరో సోదరుడు టోనీ మాత్రం భిన్నంగా ఆలోచించాడు. రఫాలోని ప్రతిభను మూడేళ్ల వయస్సులోనే గుర్తించాడు. ఆ తర్వాత నుంచి తన అకాడమీలో రఫా ప్రతిభకు సానపట్టాడు. క్రమశిక్షణ విషయంలో టోనీ అస్సలు రాజీ పడలేదు. రఫా జూనియర్ స్థాయిలో టైటిళ్లు గెలిచినా ఎటువంటి సంబరాలకు అనుమతించేవాడు కాదు. పైగా తర్వాత టోర్నికి సాధన మొదలయ్యేది. ఎర్రమట్టి కోర్టుపై అత్యంత కఠిన పరిస్థితులు సృష్టించి మరీ రఫాతో ఆడించేవాడు. ఒక దశలో రఫా.. బాబాయిపై తల్లికి ఫిర్యాదు చేశాడు. తల్లి ఆందోళన చెందినా.. శిక్షణ మాత్రం కొనసాగించారు. అండర్-12 టైటిల్ కూడా సాధించాడు. 14ఏళ్లకే స్పానిష్ జూనియర్ సర్క్యూట్‌లో రఫాకు మంచి పేరు వచ్చేసింది. బార్సిలోనాలోని అకాడమీలో శిక్షణ పొందేందుకు స్కాలర్‌షిప్ వచ్చింది. కానీ, రఫా తల్లిదండ్రులు మాత్రం టోనీ దగ్గర ఇంటి వద్దే శిక్షణ పొందేందుకు మొగ్గు చూపారు. ఈ విషయాన్ని రఫెల్ నాదల్ ఆత్మకథ ‘రఫా:మైస్టోరీ’లో పేర్కొన్నాడు.
14 ఏళ్ల వయస్సులో ప్రపంచ శ్రేణి క్రీడాకారుడు కార్లోస్ మోయాను ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో రఫా ఓడించాడు. మోయా ప్రపంచ నంబర్ వన్ ర్యాకింగ్‌లో కూడా కొన్నాళ్లు కొనసాగిన క్రీడాకారుడు. దీంతో నాదల్ పేరు మార్మోగిపోయింది. 2001లో పూర్తి స్థాయి ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడిగా మారాడు. ఆ మరుసటి సంవత్సరమే వింబుల్డన్ సెమీస్‌కు చేరాడు. 18 ఏళ్ల వయస్సు వచ్చేసరికి డేవిస్‌కప్‌లో వరల్డ్ నంబర్-2 ఆండీ రాడిక్‌ను ఓడించాడు. 2005 నాటికి ప్రపంచ నంబర్ వన్ రోజర్ ఫెదరర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగాడు. 2006-09లోపు రోజర్ ఫెదరర్‌ను ఐదు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లో ఓడించాడంటే రఫా జోరు అర్థం చేసుకోవచ్చు.
తల్లిదండ్రులు విడిపోవడంతో కుంగిపోయి..
కుటుంబంతో విపరీతమైన అనుంబంధం పెంచుకొన్న నాదల్‌కు 2009లో గట్టి దెబ్బతగిలింది. తల్లిదండ్రులు విడిపోయారు. నాదల్ విజయాలకు బలమైన కుటుంబ బంధమే కారణం. ఫ్రెంచి ఓపెన్ జరిగే ఎర్రమట్టి కోర్టైన 'రోలాండ్ గారోస్'లో నాదల్‌కు తిరుగు లేదు. 2005 నుంచి 2014 మధ్యలో నాదల్ ఓడిపోయిన ఫ్రెంచి ఓపెన్ 2009లోనే జరిగింది. తల్లిదండ్రులు విడిపోవడం తీరనిలోటుగా 'రఫా:మైస్టోరీ'లో నాదల్ పేర్కొన్నాడు. "నా ప్రవర్తన బాగోలేదు. నేను కుంగిపోయి ఉన్నాను. ఉత్సాహం కొరవడింది. టెన్నిస్ ఆడే యంత్రంగా మిగిలిపోయాను. జీవితంలో ప్రేమ రాహిత్యం నెలకొంది" అని పేర్కొన్నాడు. ఆ మానసిక పరిస్థితి శారీరకంగా అతని ఫిట్‌నెస్‌ను దెబ్బతీసింది. కానీ, 2010లో పుంజుకొన్న నాదల్ మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. ఆ మరుసటి సంవత్సరమే నాదల్ తల్లిదండ్రులు మళ్లీ కలుసుకొన్నారు. ఆ తర్వాత కెరీర్‌లో ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. మానసికంగా మాత్రం నాదల్ బలంగా ఉన్నాడు. దీనికి ఉదాహరణ తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జరిగిన సుదీర్ఘ ఫైనల్సే. ఓటమి అంచుల వరకు వెళ్లి కూడా పోరాటం చేసి విజయ శిఖరాలను చేరాడు.
అనంతపురంలో టెన్నిస్ అకాడమీ..
2010లో రఫా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 'నాదల్ ఎడ్యూకేషనల్ టెన్నిస్ స్కూల్'ను ప్రారంభించాడు. కరవు ప్రాంతంగా పేరున్న అనంతపురంలోని పేద పిల్లలకు ఆటను చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నాడు. స్పెయిన్‌కు చెందిన ఫెర్రర్ కుటుంబీకులు అనంతపురం జిల్లాలో నిర్వహించే రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌తో చేతులు కలిపి రఫా ఈ స్కూల్‌ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి స్వయంగా రఫెల్ నాదల్, తల్లి అనా మారియాతో కలిసి వచ్చారు. ఆ తర్వాతి ఏళ్లలో దీనిని స్పెయిన్‌లో కూడా విస్తరించారు. అనంతపురంలోని ఈ టెన్నిస్ స్కూల్ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఉచితంగా క్రీడా పరికరాలు ఇచ్చి.. నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇస్తోంది.
నాదల్ నమ్మకాలు.. విశేషాలు..!
- రఫెల్ నాదల్ రెండు చేతులతో ఆడగలడు. అతను ఫోర్ హ్యండ్ షాట్‌కు ఎడమ చేతిని వాడతాడు. కానీ, రెండు చేతులతో టూహ్యాండెడ్ ఫోర్‌హ్యాండ్ షాటు కూడా ఆడగలడు.
- రఫాకు చీకటంటే భయం. అతడు నిద్ర పోతున్న సమయంలో కూడా టీవీస్క్రీన్ గానీ, కనీసం ఒక లైటుగానీ వెలుగుతూనే ఉండాలి.
- ఫ్రెంచి ఓపెన్ ఆడే సమయంలో రఫా లాకర్ నంబర్ 159 మాత్రమే తీసుకొంటాడు.
- ప్రతి మ్యాచ్‌కు ముందు చన్నీటి స్నానం చేస్తాడు.
- టెన్నిస్ కోర్టులో నాదల్ తాగే వాటర్ బాటిల్స్‌ను ఓ క్రమ పద్దతిలో ఉంచి.. నీటిని తాగుతాడు.
- నాదల్ అందుకొన్న ప్రతి ట్రోఫీని కొరుకుతాడు. అది తనకు తెలియకుండానే అలవాటైపోయిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఫొటోగ్రాఫర్లు కూడా అడిగి మరీ ఆ పోజులో ఫొటోలు తీసుకొంటారని వెల్లడించాడు.
- నాదల్ ఫిట్‌నెస్ చూసి ఓ ఫ్రెంచి రాజకీయ నాయకురాలు డోపింగ్ ఆరోపణలు చేసింది. దీంతో నాదల్ పరువు నష్టం దావావేసి 11,000 డాలర్లు కట్టించాడు. ఆ మొత్తాన్ని ఫ్రాన్స్‌లోని ఓ సేవా సంస్థకు విరాళంగా ఇచ్చాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం.. 24ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి