కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా పడడం వల్ల ఇప్పటికే ఆ క్రీడలకు అర్హత సాధించిన అథ్లెట్ల పరిస్థితి సందిగ్ధంలో పడింది. వాళ్లను నేరుగా వచ్చే ఏడాది క్రీడల్లో అనుమతిస్తారా లేదా తిరిగి మళ్లీ అర్హత టోర్నీలు నిర్వహిస్తారా అనే ప్రశ్నలు రేకెత్తాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇదివరకే ఒలింపిక్స్ బెర్త్‌లు సాధించిన అథ్లెట్లు యథాప్రకారం వచ్చే ఏడాది క్రీడల్లో ప్రాతినిథ్యం వహించబోతున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), 32 అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల మధ్య గురువారం జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
"టోక్యో ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయడానికి గల కారణాలను మొదట ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ వివరించాడు. టోక్యో 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు 2021లో జరిగే క్రీడల్లో పాల్గొనడానికి అర్హులని అతను స్పష్టం చేశాడు. ఇప్పటికే మిగిలిపోయిన మిగతా అర్హత టోర్నీలను ఎప్పుడు? ఎలా? నిర్వహించాలి అనే దానిపై చర్చ జరిగింది. కొన్ని క్రీడా సమాఖ్యలకు చెందిన అథ్లెట్లు ఇంకా ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది"-కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఓ ప్రతినిధి
వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరిగే తేదీలపై రాబోయే నాలుగు వారాల్లోపు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బాక్ స్పష్టం చేశాడని మరో ప్రతినిధి వెల్లడించాడు.