PV Sindhu Relationship Status : భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించింది. తాను ఇంకా సింగిల్‌నే ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం తనకు బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదని పేర్కొంది. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే తన లక్ష్యం అని, దాని కోసమే కష్టపడుతున్నట్లు చెప్పింది. అయితే 'బ్యాడ్మింటన్ కాకుండా జీవితంలో మరో భాగస్వామి ఉండాలని మీరు అనుకుంటున్నారా?' అని అడిగిన ప్రశ్నకు 'దాని గురించి నేనెప్పుడూ అంతగా ఆలోచించలేదు. అదంతా విధి అని నేనుభావిస్తా. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది' అని సింధు సమాధానమిచ్చింది. 'ఎవరితోనైనా డేటింగ్ చేశారా?' అని అడిగిన ప్రశ్నకు 'లేదు' అని బదులిచ్చింది.
PV Sindhu Paris Olympics 2024 : ప్రస్తుతం వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది సింధు. మూడో ఒలింపిక్ పతకానికి గురిపెట్టిన ఈ తెలుగు తేజం ప్రస్తుతం బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొణె ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని సింధు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రకాశ్ పదుకొణెను తన 'మెంటార్'గా పేర్కొంది. మోకాలి గాయం కారణంగా ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్ నుంచి మధ్యలోనే వైదొలిగిన సింధు ఆ తర్వాత సయ్యద్ మోదీ టోర్నీకీ దూరమైంది. ప్రస్తుతం ఆమె గాయం నుంచి కోలుకుంటోంది.
PV Sindhu Injury : ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలను సాధించిన పీవీ సింధుకు గతేడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో గాయం అయింది. ఆ తర్వాత దాదాపు ఐదు నెలల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌లో తిరిగి షటిల్ పట్టుకుంది. దురదృష్టవశాత్తు ఈ టోర్నీతో పాటు ఇదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో కూడా ఓటమిపాలైంది. 2023 మార్చి ఆరంభంలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుంచి మొదటి రౌండ్లోనే బయటకు వచ్చేసింది పీవీ సింధు.
2023 ఏప్రిల్-మేలో జరిగిన మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ (Madrid Spain Masters 2023) టోర్నీలో ఫైనల్ వరకూ చేరుకుంది పీవీ సింధు. కానీ తుది పోరులో ఓడి టైటిల్ చేజార్చుకుంది. ఇక అప్పటినుంచి మళ్లీ ఫైనల్‌కు చేరలేదు. ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన టోర్నీల్లో 50 మ్యాచ్‌లు ఆడిన సింధు 28 మ్యాచ్‌ల్లో గెలిచింది. 22 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అంతేకాకుండా ఈ ఏడాది ఇప్పటివరకు 7 టోర్నీల్లో తొలి రౌండ్లోనే ఓడిపోయింది.
'మూడు మ్యాచులకే అంతగా అలసిపోయాడా? ఇంకెంత కాలం అతడ్ని పక్కన పెడతారు'
'కెమెరాలన్నీ నావైపే ఉండాలని కోరుకోను - డైమెండ్ లీగ్‌లో మాత్రం అలా జరగట్లేదు'