దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ గురించి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'కు హాజరైన సింధు సచిన్‌ను కొనియాడింది. తాను 2016 ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా సచిన్ ఇచ్చిన ఓ గిఫ్ట్ గురించి చెప్పింది. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ "ఆయన నన్ను పిలిచి అభినందనలు తెలిపారు. నేను 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో మొదటి సారి పాల్గొన్నప్పుడు.. నేను 2016 ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకువస్తే కారు గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. నేను మెడల్ సాధించిన తర్వాత ఆయన తన మాట నిలబెట్టుకుని వచ్చి కారు బహూకరించారు. అందుకు నిజంగా ఆయనకు నా కృతజ్ఞతలు. ఆయన అలా చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది" అని అన్నారు.
తన లాంటి క్రీడాకారులకు సచిన్ తెందుల్కర్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారని సింధు చెప్పింది. "సచిన్.. క్రీడాకారులను చాలా సపోర్ట్ చేశారు. ఇలా చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. మున్ముందు గొప్పగా రాణించేందకు దోహదపడుతుంది. ఇటువంటి అవార్డులు, రివార్డులు ఇవ్వడం వల్ల క్రీడాకారుల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు కార్లు అంటే చాలా ఇష్టం. నాకు కారు గిఫ్ట్‌గా ఇచ్చినందుకు సచిన్‌కు కృతజ్ఞతలు" అని చెప్పింది.
ఇదే కాకుండా ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ గాయం వల్ల తాను పడిన ఇబ్బంది గురించి వివరించింది. "క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నప్పుడు గాయం నొప్పి కొంచెం ఉంది. నొప్పి మ్యాచ్‌ల మధ్యలో వస్తోంది. అయినా నేను ఈ మ్యాచ్‌ను ఎలాగైనా పూర్తి చేయాలి అనే పట్టుదలతో ఉన్నా. నా మైండ్, మనసులో మెడల్ గెలవాలని ఉంది. సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగేటప్పుడు నా పూర్తి ప్రదర్శన చేయాలనుకున్నా. అందుకే వంద శాతం ప్రదర్శన చేసి గోల్డ్ మెడల్ సాధించా" అని చెప్పుకొచ్చింది.
అయితే, ఈ వారాంతం వచ్చే 'ది కపిల్ శర్మ షో'లో పీవీ సింధుతో పాటు బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, లాన్ బాల్ టీమ్ రూప రాణి తిర్కే, లవ్లీ చౌబే, పింకి సింగ్, నయన్మొని సైకియా సందడి చేయనున్నారు.
ఇవీ చదవండి: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన టీమ్ఇండియా స్టార్.. మైదానంలోకి అంబులెన్స్!
క్రీడా ప్రపంచానికి మోదీ ఆశాకిరణం.. యువతకు స్ఫూర్తి: పీవీ సింధు