PV Sindhu Malyasia Masters: మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది రెండు సూపర్ 300 టోర్నీలు గెలిచిన ఆమె.. మలేసియా మాస్టర్స్ టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో సింధు ఏడో సీడ్‌గా బరిలో దిగుతుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హి బింగ్ జియావొ (చైనా)తో ఆమె తలపడనుంది. ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే సింధును బింగ్ జియావొ ఓడించింది. ఇప్పటి వరకు వీరిద్దరు 18 సార్లు తలపడగా.. సింధు ఎనిమిదింట్లో గెలవగా, ప్రత్యర్థి 10 మ్యాచ్‌ల్లో పైచేయి సాధించింది.
తొలి రౌండ్, ప్రిక్వార్టర్స్ తర్వాత సింధుకు అసలైన సవాల్ ఎదురుకానుంది. క్వార్టర్స్‌లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడొచ్చు. గతవారం మలేసియా ఓపెన్ క్వార్టర్స్‌లో తై జు చేతిలోనే సింధుకు పరాజయం ఎదురైంది. సింధుపై ఆమెకు 16-5తో మెరుగైన గెలుపోటముల రికార్డు కూడా ఉంది. ఇక సైనా నెహ్వాల్ తొలిరౌండ్లో కిమ్ యున్ (కొరియా)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్‌దెజ్ (ఫ్రాన్స్)తో హెచ్.ఎస్.ప్రణయ్, కెవిన్ కార్డన్ (గ్వాటెమల)తో సాయి ప్రణీత్, టామి సుగియార్తో (ఇండోనేసియా)తో కశ్యప్, చౌ తీన్ చెన్ (చైనీస్ తైపీ)తో సమీర్‌వర్మ పోటీపడతారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పెర్లీ టాన్- తినా మురళీధరన్ (మలేసియా)తో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ, గాబ్రియెలా- స్టెఫాని (బల్గేరియా)తో పూజ- ఆరతి, క్వాలిఫయర్స్‌తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్పప్ప తలపడతారు.
ఇదీ చూడండి: IND vs ENG: చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు .. భారత్ గెలిచేనా..