ఒలింపిక్స్(Olympics)లో పాల్గొనబోయే అథ్లెట్ల బృందానికి అధికారికంగా పంపాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మోదీ వారితో మాట్లాడుతారని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత భారత బృందం ఎప్పుడైనా టోక్యో బయలుదేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
"ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లతో ప్రధానమంత్రి మోదీ మాట్లాడి.. అధికారికంగా టోక్యో పంపించే అవకాశం ఉంది. కానీ, అది ఏ రోజు అనేది ఇంకా స్పష్టత రాలేదు. జులై 10-15 మధ్య జరిగే కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రీడాకారులు ఎప్పుడైనా బయల్దేరవచ్చు. విదేశాల్లో వివిధ టోర్నీల్లో పాల్గొంటున్న ఆటగాళ్లు సరాసరి టోక్యోకు చేరుకుంటారు" అని సంబంధిత అధికారులు ఏఎన్ఐ వార్తాసంస్థకు వెల్లడించారు.
టోక్యో ఒలింపిక్స్ వచ్చే నెల 23 నుంచి సెప్టెంబరు 5 వరకు జరగనున్నాయి. ఒలింపిక్స్‌లో మొత్తంగా 11 క్రీడా విభాగాల్లో దాదాపుగా 100 మంది భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. దీంతో పాటు మరో 25 మంది క్రీడాకారులు అర్హత పొందే అవకాశం ఉంది. దేశం తరఫున ఎంతమంది పాల్గొంటారనే విషయంపై ఈ నెలాఖరున స్పష్టత రానుంది.
ఇదీ చూడండి.. అక్కడికి వెళ్లే అథ్లెట్ల కోసం 1.6 లక్షల కండోమ్‌లు