ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, అమెరికా స్విమ్మర్ క్లీట్ కెల్లర్పై బుధవారం కేసు నమోదైంది. గతవారం యూఎస్ క్యాపిటల్ భవనంపై జరిగిన విధ్వంసకర దాడిలో అతడు పాల్గొన్నాడని ఆరోపణలు వచ్చాయి. అల్లర్లకు సంబంధించిన ఓ వీడియోలో అతడు కనిపించగా.. ఈ మేరకు ఎఫ్‌బీఐకి ఫిర్యాదు అందింది. ఈ అభియోగాల నేపథ్యంలో కెల్లర్‌కు వారెంట్ జారీ చేశారు. అయితే అతడిని అదుపులోకి తీసుకున్నారా? లేదా! అనేది తెలియాల్సి ఉంది.
2000, 2004, 2008 వేసవి ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నాడు కెల్లర్. రెండు స్వర్ణం, ఒక రజతం సహ మరో రెండు కాంస్య పతకాలను సాధించాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తాను మద్దతుదారుడని తెలియజేసేలా ఉన్న సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాలను తొలగించాడు కెల్లర్.
ఏం జరిగిందంటే?
అధ్యక్షుడిగా జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా కాంగ్రెస్ సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ట్రంప్ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించారు.
ఇదీ చూడండి: 'ఇది ముగింపు కాదు.. అమెరికా పతనానికి ఆరంభం'