ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్‌లో అత్యంత ఆకర్షణీయ ఈవెంట్ అంటే.. 100 మీటర్ల పరుగే. ఇక గత మూడు పర్యాయాలు ఉసేన్ బోల్ట్(Usain Bolt) మెరుపులతో 100 మీ. పరుగుకు ఇంకా ఆదరణ పెరిగింది. బోల్ట్ ట్రాక్‌కు టాటా చెప్పేసిన నేపథ్యంలో.. టోక్యోలో 100 మీ. మెరుపులు ఎవరివో అని చూస్తున్నారంతా. అయితే స్వయంగా బోల్టే తన వారసుడు కాగల అథ్లెట్ అంటూ బ్రోమెల్ వైపు చూపించాడు. బ్రోమెల్ వేగం తనను ఆకట్టుకుంటోందని, అతడి పరుగు కోసం ఎదురు చూస్తున్నానని ఉసేన్ చెప్పడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
బోల్ట్ మెచ్చిన అథ్లెట్
బ్రోమెల్(Trayvon Bromell) ఆషామాషీ స్ప్రింటర్ అయితే బోల్ట్ అతడి గురించి ఇంతలా ఎందుకు చెబుతాడు? పాతికేళ్ల ఈ అమెరికా అథ్లెట్ కెరీర్లో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. చిన్నతనంలోనే పరుగుపై అమితాసక్తితో ట్రాక్‌లో అడుగుపెట్టిన అతను.. కెరీర్ ఆరంభంలోనే రికార్డులు నెలకొల్పాడు. జూనియర్ స్థాయిలో 100మీ. పరుగును 10 సెకన్లలోపే పూర్తి చేసిన తొలి స్ప్రింటర్‌గా నిలిచాడు. 9.97 సెకన్ల టైమింగ్‌తో జూనియర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అనంతరం ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన అతను.. సీనియర్ స్థాయిలోనూ అదే జోరు ప్రదర్శించాడు.

పరుగంటే ప్రాణం
బోల్ట్ పసిడి నెగ్గిన 2015 ప్రపంచ ఛాంపియన్‌షిప్ 100మీ. పరుగులో బ్రోమెల్ కాంస్యం సొంతం చేసుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బ్రోమెల్.. ఆ తర్వాత కాలి మడమలో చీలిక రావడం వల్ల ఇబ్బంది పడ్డాడు. ఓ వైపు గాయం బాధిస్తున్నా ఆ ఒలింపిక్స్‌లో పోటీపడి ఫైనల్ చేరాడు. కానీ బోల్ట్ స్వర్ణం గెలుచుకున్న ఆ ఫైనల్‌లో.. బ్రోమెల్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువైంది. పూర్తిగా కోలుకునేందుకు ట్రాక్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది తిరిగి ట్రాక్‌పై అడుగుపెట్టిన అతను.. 9.77 సెకన్లతో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసి టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించాడు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బ్రోమెల్.. ఈ సారి ఒలింపిక్స్ 100మీ. పరుగులో పసిడి దక్కించుకునేలాగే కనిపిస్తున్నాడు.
బోల్ట్ రికార్డు బద్దలు
19.93 సెకన్లు. ఎప్పుడో 2004లో బోల్ట్ 200 మీటర్ల పరుగులో నమోదు చేసిన టైమింగ్ ఇది. అండర్-20 విభాగంలో ఎవ్వరూ ఆ టైమింగ్‌ను అందుకోలేకపోయారు. 17 ఏళ్లు నిలిచిన ఉన్న ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి అథ్లెటిక్ ప్రపంచ తన వైపు చూసేలా చేశాడు అమెరికా కుర్రాడు ఎరియాన్ నైటన్(Erriyon Knighton). ఇంకా స్కూల్లో చదువుతున్న ఈ కుర్రాడి వయసు 17 ఏళ్లే. ఇంతలోనే బోల్ట్ నెలకొల్పిన రెండు రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. బోల్ట్ అండర్-18 విభాగంలో నెలకొల్పిన 200 మీ. టైమింగ్ రికార్డును కొన్ని రోజుల కిందటే బద్దలు కొట్టిన నైటన్.. ఇప్పుడు అండర్-20 రికార్డునూ చెరిపేశాడు. ఈ ప్రదర్శనతో టోక్యో బెర్తును ఖరారు చేసుకున్నాడు.

మెరుపు వేగం ఇతడి సొంతం
1968లో జిమ్ ర్యున్ తర్వాత ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న అత్యంత పిన్న వయస్కుడైన అమెరికా పురుష అథ్లెట్ నైటనే. ఈ కుర్రాడు ట్రాక్ వైపు రావడం చిత్రంగా జరిగింది. నిజానికి చిన్నతనంలో నైటన్ ఫుట్‌బాలర్. అయితే సాకర్ ఆడుతున్నపుడు అతడి వేగం చూసిన స్కూల్ కోచ్ పరుగు పందేల్లోకి వెళ్తే గొప్ప ఘనతలు సాధిస్తావని అతణ్ని అటు వైపు మళ్లించాడు. ఇక ట్రాక్ మీద అడుగు పెట్టడంతోనే సంచలన ప్రదర్శనలతో అదరగొట్టాడు నైటన్. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగింది. ఈ ఏడాది జనవరిలో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న అతను.. జాతీయ స్థాయి రేసుల్లో మెరుపు వేగంతో దూసుకెళ్లి వరుసగా టైటిళ్లు గెలవడం మొదలుపెట్టాడు. అతడి సత్తాను గుర్తించిన అడిదాస్ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. చూస్తుండగానే నైటన్ సెలబ్రెటీ అథ్లెట్ అయిపోయాడు.
ఇప్పుడు ఏకంగా బోల్ట్ రికార్డులను బద్దలు కొట్టి, టోక్యో బెర్తు సంపాదించడం ద్వారా ప్రపంచం దృష్టిలో పడ్డాడు నైటన్. బోల్ట్‌ను అధిగమించడం నమ్మశక్యంగా లేదంటూనే తాను గొప్ప ఘనతలు సాధిస్తానన్న నమ్మకం ఎప్పుడూ ఉందని అతడు అంటున్నాడు. "నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. నా ప్రతి ప్రదర్శనలోనూ నా గొప్పదనం నాకు కనిపిస్తుంటుంది. నేను శ్రమను నమ్ముతా. ప్రపంచ స్థాయి అథ్లెట్ కావడానికి ఏం చేయాలో అంతా చేస్తా" అని నైటన్ పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో మంచి అంచనాల మధ్య బరిలోకి దిగుతుతున్న ఈ అమెరికన్.. 200 మీ. ట్రాక్ మీద ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి మరి.