Hyderabadi Roller Skater Juhit : చాలామంది పిల్లలు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. శారీరక శ్రమ ఉండే ఆటలకు దూరమవుతూ.. ఎన్నో దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. అలాంటి వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించి.. సరైన మార్గనిర్దేశం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడుపల్లికి చెందిన జూహిత్‌ను చూస్తే అర్థం అవుతుంది.
టీవీకి దూరంగా.. స్కేటింగ్‌కు దగ్గరగా
Roller Skater Juhit : కాళ్లకు చక్రాలు కట్టుకుని.. రయ్‌మని దూసుకుపోతున్న ఈ కుర్రాడే జూహిత్. అందరు పిల్లల్లానే.. 6 ఏళ్లకే టీవీ, స్మార్ట్ ఫోన్ తెరకు అతుక్కుపోయాడు. వాటి నుంచి దూరం చేసి.. శారీరక వ్యాయమం ఉండేలా చేసేందుకు ఇంటికి దగ్గర్లోని స్కేటింగ్ అకాడమీలో చేర్పించారు. అంతర్జాతీయ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత అనూప్‌కుమార్ యామా, అమర్నాథ్ యామాల ఆధ్వర్యంలో శిక్షణకు పంపించారు.
తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు..
Hyderabadi Roller Skater : ప్రారంభంలోనే ఆ ఆటకు ముగ్ధుడయ్యాడు.. ఈ కుర్రాడు. సీనియర్ల విన్యాసాలు, శిక్షకుల సూచనలో దూసుకుపోతున్న వాళ్ల ప్రతిభకు ఆకర్షితుడైయ్యాడు. వాళ్లలా.. తానూ రోలర్ స్కేటర్‌గా రాణించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ, కోచ్‌ల సహకారంతో.. అనతి కాలంలోనే మంచి నైపుణ్యాలు సాధించాడు జూహిత్.
రోజు 5 గంటల సాధన..
Roller Skating : నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న జూహిత్.. రోజూ 5 గంటలకు పైనే సాధన చేస్తున్నాడు. ఉదయం జింఖానా మైదానంలో.. సాయంత్రం వెస్ట్ మారేడ్ పల్లిలోని అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇష్టమైన క్రీడ కావడం, ఎక్కువ గంటలు సాధన చేస్తుండడంతో.. మంచి ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నాడు.
మనసు పెట్టాడు.. పతకం పట్టాడు
Skating Hyderabad : తొలిరోజుల్లో తీవ్ర కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడ్డాడు. కానీ.. క్రీడపై ఉన్న మక్కువతో వెనకడుగు వేయలేదు. మరింత ఎక్కువగా మనసుపెట్టి సాధన చేసి.. జిల్లా, రాష్ర్ట, జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో పతకాల పంట పండిస్తున్నాడు. ఇప్పటి వరకు వివిధ పోటీల్లో 40కి పైగా పతకాలు సాధించి.. ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ కుర్రాడు.
17 స్వర్ణాలు..
ఇప్పటి వరకు 6 జాతీయ ఛాంపియన్ షిప్‌లలో 15 స్వర్ణ పతకాలు అందుకున్నాడు. ఇటీవల మొహాలి వేదికగా జరిగిన 59వ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మరో 2 స్వర్ణాలు సాధించాడు. ఐస్ స్కేటింగ్‌లోనూ సత్తా చాటుతున్న ఈ కుర్రాడు.. రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో సోలో డాన్స్, ఫ్రీ స్టైల్ అంటే ఇష్టమని చెబుతున్నాడు.
"చిన్నప్పుడు టీవీ ఎక్కువగా చూస్తున్నాడని స్కేటింగ్ క్లాస్‌కి పంపించాం. అప్పటినుంచి ఇక తను దాన్ని వదల్లేదు. స్కేటింగ్‌పై తనకున్న ఇష్టం తనను ఉన్నతంగా నిలబెడుతుందని నమ్మాం. అందుకే ఆ దిశలో ప్రోత్సహించాం. దాని ఫలితమే ఈ 15 స్వర్ణాలు."
- సంధ్యారాణి, జూహిత్ తల్లి
"మొదటి రోజు స్కేటింగ్ చూసి జూహిత్ కాస్త భయపడ్డాడు. కానీ నెమ్మదిగా మెలకువలు నేర్చుకుని ఇందులో నైపుణ్యం సంపాదించాడు. కష్టపడే తత్వం.. ఏదో సాధించాలనే తపనే జూహిత్‌ను మిగతా స్టూడెంట్స్ అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. జూహిత్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్."
- అనూప్‌కుమార్, శిక్షకుడు
స్కేటింగ్‌తో పాటు చదువులోనూ మంచి ప్రతిభే కనబరుస్తున్నాడు..జూహిత్. తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహాం వల్లే ఈ ప్రదర్శనలు చేశానంటున్నాడు. భవిష్యత్తులో ఆసియాతో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తేవడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు.
- ఇదీ చదవండి : Olympics: తలకు గాయమై.. ఎముకలు విరిగినా..