క్రికెట్... భారతదేశంలో దాదాపు ఏ టీవీలో చూసినా కనిపించేది ఇదే. ప్రపంచకప్ నుంచి ద్వైపాక్షిక సిరీస్‌ల వరకూ ప్రత్యేక ప్రమోషన్లు అవసరం లేకుండానే 'మెన్ ఇన్ బ్లూ' జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కూ ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. అయితే క్రికెట్‌ను ఇంతలా ఆదరిస్తోన్న భారతీయులు ఇతర క్రీడలను మాత్రం అంతగా పట్టించుకోరనే మాట కాస్త కఠినమైనదే అయినా ఇప్పటి వరకు అది వాస్తవమే. ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్ తదితర ఆటలకు దేశంలో ఆదరణ చాలా తక్కువ.
కానీ '2019' మాత్రం ఇందుకు భిన్నం. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడాకారులకు ఈ ఏడాది బాగా గుర్తుండిపోనుంది. పీవీ సింధు, మేరీ కోమ్, మానసి జోషి, భజరంగ్ పునియా తదితర క్రీడాకారులు ఆయా రంగాల్లో ప్రపంచ వేదికలపై మెరిసి.. భారత ప్రేక్షకుల మనసులను తమవైపు తిప్పుకున్నారు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకూ ప్రేక్షకాదరణ చూరగొన్నారు.
బ్యాడ్మింటన్
2019లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో మానసి జోషి కూడా బంగార పతకాన్ని కైవసం చేసుకుంది.
![How 2019 diversified cricket crazy nation's attention to other sports!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ec05e2iwwae82n2_2611newsroom_1574774774_212.jpg)
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి ద్వయం 'థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500' టైటిల్ విజేతగా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ 750 టైటిల్లోనూ ఫైనల్ వరకూ వెళ్లింది. 36 ఏళ్ల నిరీక్షణకు చెక్ పెడుతూ స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ కాంస్య పతకం సాధించాడు. 1983లో ప్రకాశ్ పదుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. వీరితో పాటు 18 ఏళ్ల లక్ష్యసేన్ కూడా ఈ ఏడాది ఏకంగా 5 పతకాలు సాధించి అందరినీ ఆకర్షించాడు.
టెన్నిస్
ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సందర్భంగా సుమిత్ నాగల్-రోజర్ ఫెదరర్ మధ్య జరిగిన మ్యాచ్ భారతీయులందరికీ గుర్తుండిపోతుంది. ప్రపంచ మేటి టెన్నిస్ ప్లేయర్లలో ఒకరైన ఫెదరర్‌ను తొలి సెట్లోనే ఓడించి ఒక్కసారిగా అందరినీ తనవైపు ఆకర్షించాడు సుమిత్. చివరకు మ్యాచ్ ఓడినప్పటికీ ఫెదరర్‌కు గట్టిపోటీనిచ్చి.. భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందితో శభాష్ అనిపించుకున్నాడు. నాగల్తో పాటు మరికొంత మంది తమ ప్రతిభను కనబర్చారు.
బాక్సింగ్
![How 2019 diversified cricket crazy nation's attention to other sports!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mary_2412newsroom_1577192474_251.jpg)
2019 మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ కాంస్య పతకం నెగ్గింది. అయితే అదే టోర్నీలో మేరీ కోమ్ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ బాక్సింగ్ అసోషియేషన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ 'ఏఐబీఏ'కు ఒక్కసారిగా వీక్షకులు కూడా పెరిగారు. అధికారుల తీరుపై ఆమె ఫిర్యాదు చేసినప్పుడు దేశం మొత్తం మేరీకి బాసటగా నిలిచింది. మరో బాక్సర్ మంజు రాణి కూడా మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకాన్ని సాధించింది.
రెజ్లింగ్
భారత రెజ్లింగ్ క్రీడాకారులకు 2019 మరచిపోలేని ఏడాదిగా మిగిలిపోతుంది. రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో దీపక్ పునియా వెండి పతకాన్ని కైవసం చేసుకోగా.. వినేశ్ ఫొగట్, రవి కుమార్, బజరంగ్ పూనియా, రాహుల్ అవారేలు కాంస్య పతకాలు సాధించారు.
![How 2019 diversified cricket crazy nation's attention to other sports!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18th-asian-games-2018_1697ff1e-a4fa-11e8-8937-8a80aaa2408c_2409newsroom_1569295908_803.jpg)
ఫుట్‌బాల్
అయితే ఫుట్‌బాల్‌లో మాత్రం భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కానీ, భారత ప్రేక్షకులు ఇతర క్రీడలతో పాటు ఫుట్‌బాల్‌ను కూడా ఆదిరించాలన్న భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ సందేశంతో 2022 ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ మ్యాచులకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
దక్షిణాసియా క్రీడల్లో భారత్ రికార్డు
2019లో దక్షిణాసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. 174 బంగారు, 93 వెండి, 45 కాంస్య పతకాలతో చరిత్రలో తొలిసారి అత్యధికంగా 312 పతకాలను ఖాతాలో వేసుకుంది. గతంలో అత్యుత్తుమంగా 309 పతకాలు సాధించింది భారత్.
భారత ప్రేక్షకులు అంతగా ఆదరించని మార్షల్ ఆర్ట్స్ కూడా రితూ ఫొగాట్ రాకతో ఈ ఏడాది మంచి ఆదరణ పొందింది.
క్రికెట్
భారత్‌లో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్.. ఈ ఏడాది నూతన శిఖరాలకు చేరింది. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది.
![How 2019 diversified cricket crazy nation's attention to other sports!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5493343_vva.jpg)
ఈ ఏడాది ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. సెమీఫైనల్ వరకు చేరింది. అయితే అనూహ్య రీతిలో సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొంది కోట్ల మంది భారతీయుల ప్రపంచకప్ ఆశలను నెరవేర్చలేక పోయింది.
2020లో టోక్యో ఒలింపిక్స్, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్, మహిళల టీ20 ప్రపంచకప్ తదితర మెగా ఈవెంట్లకు రానున్న 2020 ఏడాది వేదిక కానుంది. ఈ తరుణంలో దేశంలో క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు ప్రేక్షకాదరణ లభిస్తుండటం శుభపరిణామంగా పరిగణించొచ్చు. అలాగే భవిష్యత్‌లో భారత్.. క్రీడాసంపత్తికి కేంద్రంగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: చివరిసారిగా గర్జించాలనుకుంటున్న పేస్.. 2020లో వీడ్కోలు