కరోనా సమయంలో చెస్‌కు ఆదరణ పెరిగిందని ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అన్నారు. ఇప్పుడు చెస్ నిజమైన ప్రపంచ క్రీడగా మారిందని తెలిపారు. సోమవారం ఐక్య రాజ్య సమితిలో జరిగిన ప్రపంచ చెస్ దినోత్సవ కార్యక్రమంలో ఆనంద్ దృశ్య మాధ్యమం ద్వారా సందేశం ఇచ్చారు.
"ఇంటర్నెట్‌కు కృతజ్ఞతలు. ఇప్పుడు చెస్ నిజమైన ప్రపంచ క్రీడ అయింది. ఇప్పుడున్నంత విస్తృత ఆదరణ గతంలో ఎప్పుడూ లేదు. కరోనా మహమ్మారి సమయంలో చాలామంది చెస్ గురించి తెలుసుకున్నారు. చెస్ మరింత విస్తరించడానికి ఈ సమయం దోహద పడింది. భవిష్యత్తులోనూ చెస్‌కు ఆదరణ కొనసాగుతుందని భావిస్తున్నా"
-- విశ్వనాథన్ ఆనంద్, చెస్ గ్రాండ్‌మాస్టర్
భారత్‌లో పుట్టిన చెస్ ప్రపంచవ్యాప్తమైందని.. కాలక్రమంలో తిరిగి ఇతర దేశాల నుంచి భారత్‌కు చెస్‌ను తీసుకురావాల్సి వచ్చిందని ఆనంద్ వివరించారు. "మా అమ్మ నాకు చెస్ నేర్పింది. భారత సంస్కృతిలో చదరంగం భాగం. ఇళ్లలో ఎంతో ఉత్సాహంగా చెస్ ఆడతారు" అని ఆనంద్ చెప్పారు.
ప్రపంచ చెస్ దినోత్సవం జరుపుకోవడం ఇదే తొలిసారి. 1924 జులై 20న అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఏర్పడింది. ఫిడే ఆవిర్భావ తేదీని నిరుడు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా ప్రకటించింది. గత కొన్ని నెలల్లో ఆన్‌లైన్‌లో చెస్ ఆడే వారి సంఖ్య రెండింతలైందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.