కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్ విభాగంలో దేశానికి తొలి బంగారు పతకం సాధించి పెట్టిన కీర్తి గడించింది హరియాణా రెజ్లర్ గీతా ఫోగట్. ఏషియన్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాల పంట పండించిన ఈ స్టార్ రెజ్లర్.. 2016లో తోటి రెజ్లర్ పవన్ కుమార్ సరోహాతో పెళ్లి పీటలెక్కింది. ఈ జంటకు 2019 డిసెంబర్‌లో అర్జున్ అనే బాబు పుట్టాడు. గర్భిణిగా ఉన్న సమయంలో, బాబు పుట్టాక కొన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న గీత.. తన చిన్నారికి నాలుగు నెలలున్నప్పుడు తిరిగి రెజ్లింగ్ మ్యాట్‌పై అడుగుపెట్టేందుకు సిద్ధపడింది. కానీ అదే సమయంలో తల్లిగా తనకెదురైన కొన్ని సవాళ్లు తన ఆటకు తాత్కాలిక బ్రేక్ వేశాయంటూ ఓ సందర్భంలో పంచుకుందీ రెజ్లింగ్ క్వీన్.
అప్పుడు 25 కిలోలు పెరిగా!
‘అర్జున్ పుట్టాక నేను సుమారు 25 కిలోలు పెరిగా. ఒక అథ్లెట్‌గా నా శరీరానికి ఫిట్‌నెన్ చాలా ముఖ్యం. అదే నా ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆయుధం కూడా! అయితే ప్రసవం తర్వాత ఇలా ఒక్కసారిగా బరువు పెరిగే సరికి నా శరీరం నాకే బరువుగా అనిపించింది. ఇక లాభం లేదు.. తిరిగి వర్కవుట్స్ మొదలుపెట్టాలనుకున్నా. అప్పటికి అర్జున్‌కు నాలుగున్నర నెలలు నిండాయి. బరువు తగ్గేందుకు తిరిగి కసరత్తులు మొదలుపెట్టా. అయితే ఒక రెజ్లర్‌గా తిరిగి ఫిట్‌నెస్ పొందాలంటే కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా నేను చేసే వర్కవుట్స్ బ్రెస్ట్‌ఫీడింగ్‌పై ప్రభావం చూపుతాయనుకోలేదు. నేనెప్పుడైతే వ్యాయామాలు మొదలుపెట్టానో అప్పట్నుంచి నా కొడుకు సరిగ్గా పాలు తాగలేకపోవడం నేను గమనించా. ఎందుకలా అని ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదిస్తే.. పిల్లాడు తల్లిపాలు మానే వరకు బరువైన వ్యాయామాలు చేయకూడదని తను సలహా ఇచ్చారు. అందుకే అప్పుడు నా ఫిట్‌నెస్ రొటీన్‌కు బ్రేక్ పడింది. ఎంతైనా వాడు పసివాడు.. ముందు వాడి ఆరోగ్యమే నాకు అత్యంత ముఖ్యమనిపించింది..’ అంటూ ప్రసవం తర్వాత తొలి నాళ్లలో తనకెదురైన అనుభవాలను పంచుకుంది గీత.
రెండేళ్ల విరామం తర్వాత!
గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే! అయితే ఈ ఏడాది జరగబోయే ఆ క్రీడల కోసం సన్నద్ధం కావడానికి రెట్టింపు ఉత్సాహంతో రెజ్లింగ్ మ్యాట్‌పై అడుగుపెట్టానంటోంది గీత. ఇదే విషయాన్ని తాజాగా పంచుకుందామె. ‘ఒలింపిక్స్ నా కోసమే వాయిదా పడ్డాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ పోటీల కోసం సన్నద్ధమవడానికి నాకు ఏడాది సమయం దొరికింది. ప్రాక్టీస్ సమయంలో ప్రత్యర్థి లేకపోయినా గత కొన్ని నెలల నుంచి ఇంట్లోనే స్వయంగా సాధన చేస్తున్నా. ఇక బిడ్డ పుట్టాక సుమారు రెండేళ్ల తర్వాత తిరిగి రెజ్లింగ్ మ్యాట్‌పై అడుగుపెట్టబోతున్నా. నా ఆరోప్రాణమైన రెజ్లింగ్‌ను కొనసాగించేందుకు, కొత్త లక్ష్యాలను చేరుకునేందుకు రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నా. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి..’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీత.
అమ్మయ్యాక కూడా మహిళలు తమ కెరీర్‌లో రాణించగల సమర్థులు అని నిరూపించుకోవడంతో పాటు రాబోయే ఒలింపిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతోన్న గీతకు మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..!
- ఇదీ చూడండి : గతేడాది హైదరాబాద్ వరదలపై నీతి ఆయోగ్ నివేదిక