కరోనా తర్వాత ఫార్ములావన్ రేసులు పునః ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఐరోపా దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వల్ల.. వాయిదా పడిన రేసులకు కొత్త షెడ్యూల్ ప్రకటించారు ఎఫ్1 నిర్వాహకులు. జులై తొలివారంలో ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులతో 2020 సీజన్ ఆరంభమవుతుంది. మొత్తం ఎనిమిది రేసులు జరగనున్నాయి.
జులై 5, 12న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి, జూలై 19న హంగేరి గ్రాండ్‌ప్రి రేసులు నిర్వహిస్తారు. అనంతరం ఆగస్టు 2న, ఆగస్టు 9న బ్రిటన్, ఆగస్టు 16న స్పెయిన్, ఆగస్టు 30న బెల్జియం, సెప్టెంబరు 6న ఇటలీ వేదికగా ఈ రేసులు జరుగుతాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమైతే.. సీజన్‌లో మొత్తం 22 రేసులు జరగాలి. అయితే కరోనా మహమ్మారి ప్రభావంతో వాటి సంఖ్యను కుదించారు. ఇప్పటికైతే ఎనిమిది రేసుల తేదీలను ఖరారు చేయగా.. వాటిని 15 లేదా 18 రేసులకు పెంచుతామని నిర్వహకులు తెలిపారు. అయితే ఈ మ్యాచ్‌లన్నీ అభిమానులు లేకుండానే జరగనున్నాయి.
వర్చువల్ రేసులు ఉండవా..!
కరోనా వైరస్ కారణంగా ఫార్ములావన్ రేసులు వాయిదా పడిన నేపథ్యంలో అప్పట్లో కీలక నిర్ణయం ప్రకటించింది ఎఫ్ వన్. అభిమానుల కోసం డ్రైవర్లు వర్చువల్ రియాలిటీ రేసుల్లో పోటీపడతారని చెప్పింది. అభిమానులు ఎఫ్-1 రేసులను చూసే అవకాశాన్ని కోల్పోతున్న భావన కలగకుండా జూన్ 7 నుంచి ఈ క్రీడలు జరుగుతాయని ప్రకటించింది. అయితే తాజాగా రేసింగ్ కార్యక్రమాలు పునరుద్ధరణ కావడం వల్ల ఇవి రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదీ చూడండి: 'ఆల్‌టైం గ్రేట్స్' జాబితాలో హామిల్టన్‌కు రెండోస్థానం