Djokovic Corona: టెన్నిస్ నంబర్ వన్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ డిసెంబర్లో కొవిడ్-19 బారిన పడినట్లు ఇతడి తరఫున లాయర్లు శనివారం మెల్‌బోర్న్‌లోని ఫెడరల్ కోర్టుకు విన్నవించారు. అందువల్లే అతడికి 'ఆస్ట్రేలియా ఓపెన్'లో పాల్గొనడానికి వైద్యపరమైన ప్రత్యేక మినహాయింపు ఇచ్చారని తెలిపారు. అయితే అతడికి కరోనా సోకిన మరుసటి రోజే ఓ టోర్నమెంట్‌కు హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఏం జరిగిందంటే!
డిసెంబర్ 16న జకోవిచ్‌కు కరోనా సోకిందని ఇతడి తరఫున లాయర్లు మెల్‌బోర్న్‌లోని ఫెడరల్ కోర్టుకు విన్నవించారు. అందుకే ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనడానికి వైద్యపరమైన ప్రత్యేక మినహాయింపు ఇచ్చారని తెలిపారు. అయితే అదే నెల 17న జకోవిచ్.. బెల్గ్రేడ్లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఇతడు మాస్క్ కూడా ధరించలేదు. దీనికి సంబంధించిన ఫొటోలను బెల్గ్రేడ్ టెన్నిస్ సమాఖ్య సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేసింది. ఇందులో యువ ఆటగాళ్లకు ట్రోఫీలు అందిస్తూ కనిపించాడు జకో. అలాగే అదే రోజు మరో ఈవెంట్లో పాల్గొన్నాడు ఈ టెన్నిస్ ఆటగాడు. సెర్బియా జాతీయ పోస్టల్ కార్యాలయంలో ఇతడి ముఖచిత్రంతో ఉన్న పోస్టల్ స్టాంప్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను జకో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ క్రీడావర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
జకోవిచ్ వీసా రద్దు
జకోవిచ్ ఈ సీజన్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన 'ఆస్ట్రేలియన్ ఓపెన్'లో పాల్గొనేందుకు నాలుగు రోజుల క్రితం మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడికి సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్ వీసాను రద్దు చేసి డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్.