కృష్ణ కుటుంబమంతా క్రీడాకారులే. నాన్న జయశంకర్ మేనన్, అమ్మ ప్రసన్న కుమారి బాస్కెట్‌బాల్ ప్లేయర్లు. వాళ్లది చెన్నై. రైల్వే సౌత్‌జోన్ క్రీడాకారులకు కోచ్‌గా పనిచేసే అమ్మే తనకు ప్రేరణ. కృష్ణకు ఓ చెల్లి, అర్చన. పొడవు, దేహ దారుఢ్యం అమ్మానాన్నల నుంచి కృష్ణకు వచ్చాయి. అయితే అవి చిన్నప్పటి నుంచి శాపంగానే ఉండేవి. బడిలో తోటి పిల్లలు ఇంత పొడవుగా ఉన్నావేంటి అని వెక్కిరించే వారు. తనతో కలిసేవారు కాదు. తన సైజుకు చెప్పులు దొరికేవి కాదు. చదువులో ముందున్నా, పొడవు వల్ల వెనుక బెంచీ విద్యార్థినిగా మారిపోవాల్సి వచ్చింది. వారికి బదులు చెప్పలేక, తానెందుకు అందరికన్నా పొడవుగా ఉన్నానో తెలియక కుంగుబాటుకు గురయ్యేది.
చెల్లి తోడు
కృష్ణ మానసిక వేదనను మొదటగా ఆమె చెల్లి గుర్తించింది. ఇవన్నీ అదనపు శక్తిగా తీసుకోవాలని ధైర్యం చెప్పేది. లోపం అనుకుంటున్న ఎత్తుతో ఏదైనా సాధించాలని స్ఫూర్తి నింపేది. చెల్లి కౌన్సిలింగ్ కృష్ణ మీద బాగానే పని చేసింది. క్రీడల్లో అడుగుపెట్టాలనుకుంది. టెన్నిస్ ఆడటం మొదలుపెట్టింది. తర్వాత బ్యాడ్మింటన్ ఆడేది. అయితే వీటిపై ఆసక్తి పెరగలేదామెకు. అప్పటికే 5.3 అడుగుల ఎత్తులో ఉండే తనను ఐదో తరగతిలో పీటీ మాస్టారు షాట్‌పుట్‌లో చేరమని ప్రోత్సహించారు. ఫీల్డ్ కోచ్ ఒకరు డిస్కస్‌కు సరైన శారీరక దారుఢ్యం ఉందని సలహా ఇవ్వడం వల్ల 2018లో ఈ క్రీడను ఎంచుకుందీమె.
జీన్స్..
ఎత్తుగా ఉండటం, క్రీడలపై ఆసక్తి వంటివన్నీ తన జీన్స్‌లోనే ఉన్నాయంటుంది కృష్ణ. 'అమ్మానాన్నలిద్దరూ బాగా పొడవుగా ఉంటారు. నాన్నలాగే నావీ వెడల్పైన భుజాలు. కోచ్ సలహాతో డిస్కస్ త్రోలో చేరా. సునాయాసంగానే మెలకువలు నేర్చుకున్నా. స్థానిక పోటీల్లో విజేతగా నిలిచే నాకు టెన్విక్ క్రీడా సంస్థ మంచి అవకాశాన్ని కల్పించింది. అలా నా 16వ ఏటనే గుంటూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ అకాడెమీలో శిక్షణ తీసుకున్నా. క్రికెటర్ అనిల్ కుంబ్లే అందించిన ఆర్థిక చేయూతతో కోచ్ వాస్సెల్ దగ్గర చేరే అవకాశం వచ్చింది. అది నా క్రీడా జీవితంలో మలుపు' అని గుర్తు చేసుకుంది కృష్ణ.
పతకాలు
జాతీయ స్థాయి అండర్ - 19 పోటీల్లో రజత పతకాన్ని సాధించింది. ఈనెల 17 నుంచి 22 వరకు నైరోబీ, కెన్యాలో జరుగనున్న 'వరల్డ్ అండర్- 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్'లో పాల్గొనడానికి కింగ్‌స్టన్‌లోని త్రో క్లబ్ 'త్రోయర్స్ ఆర్ యుఎస్'లో శిక్షణ తీసుకుంటోంది. కోచ్ హోరేస్ మైఖేల్ వాసెల్ పర్యవేక్షణలో శిక్షణ అందుకుంటోంది. తాజాగా కృష్ణకు టెక్సాస్ విశ్వవిద్యాలయం 'అకడెమిక్ అండ్ అథ్లెటిక్ స్కాలర్‌షిప్'గా రూ.1.5 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇంత భారీ ఉపకారవేతనాన్ని అందుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందంటోంది కృష్ణ. 'నేనెందుకిలా అందరికన్నా భిన్నంగా, పొడుగ్గా ఉన్నానా అని బాధపడే దాన్ని. అయితే అదే వేదనను విజయంగా మార్చుకున్నాను. ఇప్పుడు దేశంలో జూనియర్ గర్ల్స్ డిస్కస్ త్రోలో నెంబర్ వన్ ర్యాంకు నాది. గతంలో ట్రిపుల్ జంపర్ లిజాబెత్ కరోలినే ఈ స్కాలర్‌షిప్‌ను అందుకోగా, నేను రెండో అమ్మాయిని' అని అంటున్న కృష్ణ అంతర్జాతీయ పోటీల్లోనూ విజయ పతాకాన్ని ఎగురవేయాలని ఆశిద్దాం.
ఇదీ చదవండి : 'ధోనీ.. ధోనీ.. ధోనీ'.. సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది!