ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. ఇందులో మూడుసార్లు పారాఒలింపిక్ మెడల్ విజేత దేవేంద్ర జజారియా, మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్, సీనియర్ బాక్సింగ్ క్రీడాకారిణి సరితా దేవితో పాటు పలువురు ఉన్నారు. ఈ కమిటీకి మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ముకుందకుమ్ శర్మ నేతృత్వం వహించనున్నారు. అథ్లెట్లు, కోచ్ రెండు విభాగాల్లో అవార్డు గ్రహీతలను ఎంపిక చేయనున్నారు. త్వరలోనే ఈ కమిటీ సమావేశమై విజేతలను ప్రకటించనుంది.
కమిటీలో ఎవరు?
ఈ కమిటీలో పారాఒలింపిక్ మెడల్ విజేత దేవేంద్ర జజారియా, మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్, సీనియర్ బాక్సింగ్ క్రీడాకారణి సరితా దేవి, మాజీ షూటర్ అంజలీ భగవత్, మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా, హాకీ కోచ్ బల్దేవ్ సింగ్, సాయ్ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, సీనియర్ జర్నలిస్టులు విజయ్ లోకపల్లీ, విక్రాంత్ గుప్తా ఉన్నారు.
ఈ ఏడాది కరోనాతో పాటు ఒలింపిక్స్, పారాలింపిక్స్ వల్ల ఎంపిక ప్రక్రియ ఆలస్యమైంది. విశ్వక్రీడల్లో క్రీడాకారుల ప్రదర్శనను పరిగణలోకి తీసుకునేందుకు ఇంతకాలం ఎదురుచూశారు. ప్రస్తుతం ఈ రెండు మెగాటోర్నీలు ముగియడం వల్ల ఎంపిక ప్రక్రియకు అంతా సిద్ధమైంది. ప్రతి ఏడాది ధ్యాన్‌చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న ఈ పురస్కారాలను అందజేసేవారు. కానీ ఈ ఏడాది కాస్త ఆలస్యం కానుంది.
జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న ప్రైజ్ మనీ రూ.25 లక్షలు కాగా, అర్జున పురస్కార గ్రహీతకు రూ.15 లక్షలు దక్కనున్నాయి. వీటితో పాటు ద్రోణాచార్య, జీవిత సాఫల్య పురస్కారం, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, మౌలానా అబుల్ కలామ్ అజాద్ ట్రోఫీ గ్రహీతలను ప్రకటించనున్నారు.