దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రతి ఏటా జరిగే క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం గురువారం జరిగింది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అవార్డులు బహుకరించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. పారాఒలింపిక్ రజత పతక విజేత దీపామాలిక్.. 'రాజీవ్ ఖేల్‌రత్న' అందుకున్న తొలి పారా అథ్లెట్‌గా నిలిచారు. అలానే ఈ అవార్డు అందుకున్న అత్యధిక వయసు గల అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి బాక్సర్ భజరంగ్ పూనియా, క్రికెటర్ రవీంద్ర జడేజా గైర్హాజరయ్యారు.
ప్రతీ ఏడాది ఆగస్టు 29న ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా... అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన భారత క్రీడాకారులకు జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేస్తారు.
2016లో జరిగిన రియో పారా ఒలింపిక్స్‌లో షాట్‌పుట్ ఎఫ్53 విభాగంలో వెండి పతకం సాధించారు దీపా. ఈ ఏడాది ఆ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును అందుకోవడంపై ఆనందం వక్తం చేశారు.
"చాలా ఆనందంగా ఉంది. ప్రజల్లో దివ్యాంగులపై ఉన్న ఆలోచన విధానం మారుతుందని ఆశిస్తున్నాను. ఈ అవార్డు ఎంతోమంది దివ్యాంగ మహిళా అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నాను". -దీపా మాలిక్, పారా అథ్లెట్
అదే విధంగా అర్జున, ద్రోణాచార్య(సాధారణ),ద్రోణాచార్య(జీవితకాల సాఫల్య), ధ్యాన్‌చంద్ అవార్డులను ప్రదానం చేశారు. ఆ క్రీడాకారుల జాబితా విభాగాల వారీగా..
ఖేల్ రత్న: భజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపా మాలిక్ (పారా అథ్లెట్)
అర్జున అవార్డు: తేజిందర్ పాల్ సింగ్ (అథ్లెటిక్స్), మహ్మద్ అనాస్ (అథ్లెటిక్స్), ఎస్ భాస్కరన్ (బాడీ బిల్డింగ్), సోనియా లాథర్(బాక్సింగ్), రవీంద్ర జడేజా (క్రికెటర్), చింగ్లెన్సన కంగుజం (హాకీ), అజయ్ ఠాకుర్ (కబడ్డీ), గౌరవ్ సింగ్ గిల్ (మోటార్ స్పోర్ట్స్), ప్రమోద్ భగత్ (పారా స్పోర్ట్స్-బ్యాడ్మింటన్), అంజుమ్ మోద్గిల్ (షూటింగ్), హర్మీత్ రాజుల్ దేశాయ్ (టేబుల్ టెన్నిస్), పూజా దండా (రెజ్లింగ్), ఫౌద్ మీర్జా (ఈక్వెస్ట్రియిన్), గుర్ప్రీత్ సింగ్ సంధు (ఫుట్‌బాల్), పూనమ్ యాదన్ (క్రికెటర్) స్వప్న బర్మాన్ (అథ్లెటిక్స్), సుందర్ సింగ్ గుర్జార్ (పారా స్పోర్ట్స్-అథ్లెటిక్స్), భమిడిపాటి సాయి ప్రణీత్ (బ్యాడ్మింటన్), సిమ్రాన్ సింగ్ షెర్గిల్ (పోలో)
ద్రోణాచార్య అవార్డు (సాధారణ విభాగం): విమల్ కుమార్ (బ్యాడ్మింటన్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మోహిందర్ సింగ్ దిల్లాన్ (అథ్లెటిక్స్)
ద్రోణాచార్య అవార్డు (జీవితకాల సాఫల్య): మెజ్బాన్ పాటిల్ (హాకీ), రాంబీర్ సింగ్ (కబడ్డీ), సంజయ్ భరద్వాజ్ (క్రికెటర్).
ధ్యాన్‌చంద్ అవార్డు: మాన్యువల్ ఫ్రెడ్రిక్స్ (హాకీ), అరూప్ బాసక్ (టేబుల్ టెన్నిస్), మనోజ్ కుమార్ (రెజ్లింగ్), నితెన్ కిర్తానే (టెన్నిస్), సీ లాల్రెమ్సంగా (ఆర్చరీ)
టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు: అపర్ణ కుమార్ (నేల విభాగం), లేట్ దీపాంకర్ ఘోష్ (నేల విభాగం), మనికందన్ కే (నేల విభాగం), ప్రభాత్ రాజు కోలి (నీటి విభాగం), రామేశ్వర్ జంగ్రా (గాలి విభాగం), వాంగ్‌చుక్ షెర్పా (జీవిత సాఫల్య విభాగం)
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక పురస్కారం: అనంతపుర్ స్పోర్ట్స్ అకాడమీ, గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్, మౌలానా అబుల్ కలామ్ అజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ(ఛండీఘర్).