స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ యాదవ్.. ఓ హత్య కేసులో భాగంగా ఇటీవల అరెస్టయ్యాడు. మన దేశానికి చెందిన ఆటగాళ్లు ఇలా జైలుపాలవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో పలువురు భారతీయ క్రీడాకారులు అరెస్ట్ అయ్యారు. కొన్నేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. ఇంతకీ వాళ్లు ఎవరు? ఏ కారణంతో జైలుకు వెళ్లారు?
శ్రీశాంత్-క్రికెటర్
2012లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రీశాంత్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత తప్పు ఒప్పుకోవడం వల్ల ఇతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. 2018లో బ్యాన్ ఎత్తివేసి, ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అతడికి అనుమతిచ్చింది. 2020లో అతడిపై భారత బోర్డు విధించిన ఏడేళ్ల నిషేధం పూర్తయింది. దీంతో గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేరళ తరఫున ఆడాడు.
నవజ్యోత్ సింగ్ సిద్ధు- క్రికెటర్
పాటియాలాకు చెందిన ఓ వ్యక్తిని గాయపర్చడం సహా అతడి మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధును 1991లో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మూడేళ్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు. ఈ క్రమంలోనే తన ఎంపీ పదవికీ రాజీనామా చేశాడు. అయితే 2018లో సుప్రీంకోర్టు.. ఈ కేసులో సిద్ధును నిర్దోషిగా ప్రకటించింది.
దీపక్ పహల్-బాక్సర్
పోలీస్ కస్టడీ నుంచి ఓ గ్యాంగ్‌స్టర్ తప్పించుకోవడానికి కారణమయ్యాడనే ఆరోపణలతో 2016లో బాక్సర్ దీపక్ పహల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోన్పట్లోని సాయ్ అకాడమీలో ఉన్నప్పుడు ఓ బాక్సర్ దవడ కూడా ఇతడు విరగ్గొట్టాడు. 60 కిలోల లైట్‌వెయిట్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన దీపక్.. 2011 జాతీయ జూనియర్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం సాధించాడు.
జై భగవాన్-బాక్సర్
రెండుసార్లు ఆసియన్ ఛాంపియన్షిప్ పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత అయిన బాక్సర్ జై భగవాన్.. హరియాణాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అయితే ఓ హోటల్ మేనేజర్‌ను బెదిరించాడనే కారణంగా సస్పెండ్ అయ్యాడు. 2015లో ముగ్గురు గ్యాంబర్ల నుంచి రూ.లక్ష లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో మరోసారి సస్పెండ్ అయ్యాడు.
తన్వీర్ హుస్సేన్- స్నో పీస్ రేసర్
స్నో షూ ఛాంపియన్షిప్ కోసం న్యూయార్క్ వెళ్లిన భారత అథ్లెట్ తన్వీర్ హుస్సేన్.. మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణలతో 2017లో అరెస్టయ్యాడు. అతడిపై ఫస్ట్ డిగ్రీ లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఆ తర్వాత తప్పు ఒప్పుకోవడం వల్ల అతడిని విడిచిపెట్టారు. ఆ అమ్మాయి సంరక్షణ బాధ్యత చూసుకోవాలని న్యాయస్థానం ఇతడిని ఆదేశించింది.