ఇప్పటికే క్రీడాకారుల బయోపిక్స్ వచ్చాయి, వస్తున్నాయి. ప్రముఖుల గురించి ఇలా తీయడం సాధారణమేగా అనిపిస్తోంది కదూ. కానీ ఈసారి వివాదాలతో ఆటకు దూరమైన ఓ అమ్మాయి జీవితం పెద్ద తెర మీద కనిపించనుంది. మరి ఒక సినిమాకు సరిపోయేంతగా ఏముంది తన జీవితంలో...?
దుమారం రేపిన ఆరోపణలు..
పింకీ ప్రామాణిక్.. పశ్చిమ్ బంగాలోని చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది. స్ప్రింటర్‌గా అంతర్జాతీయ పోటీల్లో ఎన్నో బంగారు, వెండి పతకాలనూ గెలిచింది. త్వరలో ఒలింపిక్స్ కలను నిజం చేసుకోబోతోందనగా ఆమె జీవితం తలకిందులైంది. తనతోపాటు నివసించే ఒకమ్మాయి పింకీ తనపై అత్యాచారం చేసిందనీ, తనసలు అమ్మాయే కాదని కేసు పెట్టింది. దీంతో పింకీ పరుగే కాకుండా రైల్వేలో ఉద్యోగానికీ దూరమైంది.
దుర్భర జీవితం..
22 ఏళ్ల వయసులో జైల్లో మగవాళ్ల సెల్‌లో గడిపింది. అరెస్ట్ చేసినపుడూ, కోర్టుకు తీసుకెళ్లేటపుడూ మహిళా కానిస్టేబుల్స్ ఉండే వారు కాదు. మగ పోలీసులే తోడు వచ్చేవారు. వారు ఆమెతో ప్రవర్తించిన తీరు అప్పట్లో చర్చనీయాంశం కూడా అయ్యింది.
ఆయుధాల కేసులో..
రెండు సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత 2014లో ఆమెపై ఆరోపణలన్నీ అసత్యాలని తేలడంతో కోల్‌కతా హైకోర్టు కేసు కొట్టేసింది. మళ్లీ ఉద్యోగం లభించినా ఆటకీ, తన కలకీ దూరమైంది. దీనికి ముందూ పింకీ ఆయుధాల కేసులో జైలుకెళ్లింది. ఎవరో ఆమెకు తెలియకుండా బ్యాగులో పెట్టిన ఆధారాలు దొరకడంతో ఆ కేసు కొట్టేశారు. దీన్నుంచీ బయటపడటానికే ఆమెకు చాలా కాలం పట్టింది కూడా.
తాజాగా బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ ఈమె బయోపిక్‌ను తీయబోతున్నట్లు ప్రకటించారు. వివాదాలతో కూడిన ఈమె జీవిత కథను ఎంచుకోవడం చర్చనీయాంశ మైంది. ‘పింకీ ఒకప్పుడు దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ఆమె విజయాలను దేశమంతా సంబరాలు చేసుకుంది. కానీ తర్వాత ఆమె లింగమే ప్రశ్నార్థకమైంది. మానభంగ ఆరోపణతో క్రీడా కెరియరే ముగిసింది. కానీ పోరాడి గెలిచింది. ఆమె పోరాటాన్ని అందరికీ తెలియజేయాలని పించింది’ అంటోంది రచయిత ప్రియాంక ఘటక్. ఇలాగైనా తన కష్టాలు, పోరాడిన తీరు అందరికీ తెలియజేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందంటోంది పింకీ. తారాగణం, తదితర వివరాలు త్వరలో చెబుతామంటున్నారు.
- ఇదీ చదవండి : ''ఆదిత్య 369'.. ఆయన వల్లే తెరపైకి..'